Telangana CM Revanth Reddy Slams BRS in Assembly: నీటి పారుదల రంగంపై తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో శనివారం శ్వేతపత్రం విడుదల చేసింది. దీనిపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడీవేడీ వాదనలు సాగాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao).. మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడారు. కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టు తెలంగాణకు వర ప్రదాయిని కాదని.. కళంకంగా మారిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో పదేళ్లలో తెలంగాణను దివాళా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నీటి పారుదల రంగంపై విపక్షాలు అభిప్రాయం చెప్పాయి. ఇతరులు ఇచ్చే నివేదికను ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. గత ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టులపై విశ్రాంత ఇంజినీర్లతో కమిటీ వేసింది. ఆ కమిటీ నివేదికను సభ ముందు ఉంచుతున్నాం. ఐదుగురు ఇంజినీర్ల కమిటీ ప్రాజెక్టులపై నివేదిక ఇచ్చింది. తుమ్మిడిహట్టి వద్ద కాకుండా మరోచోట ప్రాజెక్ట్ రీడిజైనింగ్ కు ఇక్కడే పునాది పడింది. గత ప్రభుత్వం జరిగిన తప్పులు అంగీకరించి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి ఉంటే బాగుండేది. కానీ చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు వాళ్లు ప్రయత్నిస్తూ.. మాపై ఎదురుదాడికి దిగుతున్నారు. వారి తప్పులు అంగీకరించి సలహాలు ఇస్తే కొంతమేరైనా తెలంగాణ సమాజం అభినందించేది. మంత్రి ఉత్తమ్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నే తప్పుబడుతున్నారు. కేసీఆర్ , హరీష్ కలిసి రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశారో వాళ్లు తెలుసుకోవాలి.' అని సీఎం వ్యాఖ్యానించారు.


'నివేదికను తొక్కి పెట్టారు'


మహారాష్ట్ర, తెలంగాణ మధ్య 2012లో ఒప్పందం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రాణహిత - చేవెళ్ల నిర్మాణ అడ్డంకులు తొలగించేందుకు చర్చలు జరిగాయని అన్నారు. అంతర్రాష్ట్ర బోర్డు, స్టాండింగ్ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు జరిగిందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటయ్యాక మహారాష్ట్ర, తెలంగాణ సీఎంలు చర్చించారని పేర్కొన్నారు. 'మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ కట్టాలని నాటి సీఎం ఇంజినీర్లను ఆదేశించారు. తుమ్మిడిహట్టి దగ్గరే ప్రాజెక్టు నిర్మించాలని వారు నియమించిన ఇంజినీర్ల కమిటీ తెలిపింది. మేడిగడ్డ ద్వారా మిడ్ మానేరుకు 160 టీఎంసీలు ఎత్తిపోతల సరికాదని కమిటీ చెప్పింది. మేడిగడ్డ వద్ద నిర్మిస్తే నిరుపయోగమని ఐదుగురు ఇంజినీర్ల కమిటీ తేల్చింది. కానీ ఇంజినీర్లు ఇచ్చిన నివేదికను గత ప్రభుత్వం తొక్కిపెట్టింది. తెలంగాణ ఖజానాను కొల్లగొట్టేందుకు ఇంత దుర్మార్గానికి తెగబడ్డారు. కేసీఆర్, హరీష్ రావు కలిసి రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశారో తెలుసుకోవాలి. ప్రాజెక్టులు పగిలిపోతుంటే క్షమాపణలు చెప్పకుండా ఇంకా వాదిస్తారా?' అంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.


అంతకు ముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది స్వతంత్ర్య భారతదేశంలోనే అతి పెద్ద కుంభకోణం అని ఆరోపించారు. కీలకమైన బ్యారేజ్‌ ఇలా నాణ్యత లోపంతో కుంగిపోవడం చాలా దురదృష్ణకరమని అన్నారు. వందేళ్లు భద్రంగా ఉండాల్సిన కట్టడం మూడేళ్లకే కుప్పకూలిందన్నారు. గత ప్రభుత్వ అవినీతి వల్ల ప్రాజెక్టు కుప్పకూలిందన్నారు. 


Also Read: White Paper On irrigation Projects: నీటి ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో శ్వేతపత్రం- గత ప్రభుత్వంపై ఉత్తమ్‌ ఘాటు విమర్శలు