Henley & Partners Survey:  తరతరాలకి సరిపడా సంపాదించాలనుందా..? ప్రశాంతంగా రిటైర్‌ అయిపోయి కాలుమీద కాలు వేసుకుని గడపాలనుందా..? అయితే...స్విట్జర్‌లాండ్‌లో సెటిల్ అయిపోవాల్సిందే.  Henley & Partners సంస్థ చెప్పిన విషయమిది. ముఖ్యంగా భారతీయులకు ఈ దేశం చాలా సూటబుల్ అంట. తరతరాలకు సరిపడా సంపాదించుకోవడానికి అవకాశం కల్పించే దేశాల్లో స్విట్జర్‌లాండ్‌ టాప్‌లో ఉంది. ఈ ఇండెక్స్‌లో 85% మార్కులు సాధించింది. మొత్తం ఆరు అంశాలను పరిగణించి సర్వే చేపట్టింది ఈ సంస్థ. ఎంత వరకూ సంపాదించే అవకాశముంది..? కెరీర్‌లో అవకాశాలున్నాయి..? ఉద్యోగాలు దొరుకుతాయా లేదా..? విద్యారంగం పరిస్థితులేంటి..? జీవించడానికి అనువుగా ఉందా లేదా...ఇలా అన్ని కోణాల్లో అధ్యయనం చేసి స్విట్జర్‌లాండ్ ఈ అన్నింటిలోనీ బెస్ట్‌గా ఉందని తేల్చి చెప్పింది. సంపాదన విషయంలో స్విట్జర్‌లాండ్‌కి 100 పాయింట్‌లు దక్కాయి. కెరీర్‌లో 95 పాయింట్‌లు, ఉద్యోగావకాశాల విషయంలో 94 పాయింట్స్ సంపాదించుకుంది. ప్రశాంతంగా జీవించగగిలే అవకాశముందా లేదా అని సర్వే చేస్తే ఇందులో 75 పాయింట్స్ స్కోర్ చేసింది. ఎడ్యుకేషన్ విషయంలో 72 పాయింట్‌లు దక్కించుకుంది. అమెరికా అంత కన్నా ఎక్కువగా 82 పాయింట్‌లు సాధించింది. అటు ఉద్యోగావకాశాల్లోనూ స్విట్జర్‌లాండ్‌తో దీటుగా పోటీ పడుతోంది అగ్రరాజ్యం. అయితే...సంపాదన విషయంలో మాత్రం అమెరికా వెనకబడిపోయింది. కెరీర్‌ విషయంలోనూ ఇంతే. 


ఈ ఇండెక్స్‌లో భారత్‌కి 32 పాయింట్‌లు మాత్రమే వచ్చాయి. అతి తక్కువ పాయింట్‌లు వచ్చిన 15 దేశాల్లో ఒకటిగా నిలిచింది భారత్. కెరీర్ అడ్వాన్స్‌మెంట్ విషయంలో 43 పాయింట్‌లు సాధించింది. ఈ ఇండెక్స్‌లో మూడో స్థానంలో నిలిచింది సింగపూర్. ఉద్యోగావకాశాల విషయంలో 97 పాయింట్స్ స్కోర్ చేసింది. అయితే...కెరీర్ అడ్వాన్స్‌మెంట్ విషయంలో మాత్రం కేవలం 5 పాయింట్లకే పరిమితమైంది. విద్యారంగంలో 55 పాయింట్‌లు వచ్చాయి. ఈ ఇండెక్స్‌లో నాలుగో స్థానం దక్కించుకుంది ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో సంపాదన విషయంలో 66 పాయింట్‌లు రాగా...కెరీర్‌ అడ్వాన్స్‌మెంట్‌లో 79 పాయింట్‌లు వచ్చాయి.