Telangana Elections 2024 Polling percentage | హైదరాబాద్: తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలు 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తరువాత తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, శాంతి భద్రత సమస్యలు తలెత్తలేదని చెప్పారు. ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఘటనలు, ఫిర్యాదులతో సోమవారం 38 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఓటింగ్ ముగిసిన తరువాత ఈవీఎంలను రాత్రి ఒకటి, రెండు గంటల వరకు తరలించి భద్రపరచనున్నట్లు తెలిపారు. ఒకవేళ పోలింగ్ కేంద్రం వద్దే కౌంటింగ్ సెంటర్ ఉన్నట్లయితే అక్కడే స్ట్రాంగ్ రూమ్ లకు ఈవీఎంలు తరలిస్తామన్నారు.


వికాస్ రాజ్ ఇంకా మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. గత ఐదారు నెలలుగా సిబ్బంది ఎన్నికల ప్రక్రియను నిర్వహించి తమ బాధ్యతల్ని విజయవంతంగా పూర్తి చేశారు. భారీ బందోబస్తుతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లకు తరలించి భద్రపరచనున్నారు. పోలింగ్ శాతం ఎంత నమోదు అవుతుందో ఇప్పుడే చెప్పలేం. ఈరోజు అర్ధరాత్రి లేక మంగళవారం ఉదయం పోలింగ్ శాతంపై క్లారిటీ వస్తుంది. గతంలోలాగే హైదరాబాద్ లో ఈ ఎన్నికల్లోనూ అతి తక్కువ శాతం పోలింగ్ నమోదైనట్లు’ పేర్కొన్నారు. 


మధ్యాహ్నం నుంచి ఓటింగ్ కేంద్రాలకు పోటెత్తారు..
మధ్యాహ్నం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు అధికంగా వచ్చారు. ఈవీఎంలలో సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాం. మంగళవారం ఉదయం 11 గంటలకు స్క్రూటినీ చేసిన తరువాత రీ పోలింగ్ అవసరమా లేదా తేలుతుంది. అత్యధికంగా మెదక్ లో 71.33 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ లో 39.17 శాతం పోలింగ్ జరిగిందన్నారు. పోలింగ్ శాతంపై మంగళవారం స్పష్టత వస్తుందన్నారు. 


మార్చి నుంచి ఇప్పటివరకూ రూ.330 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈసీఐ పోర్టల్ ద్వారా 415 ఫిర్యాదులు రాగా, 1950 టోల్ ఫ్రీ ద్వారా 21 ఫిర్యాదులు, సీ విజిల్ ద్వారా 225 ఫిర్యాదులు వచ్చాయన్నారు.