Mukku Avinash About How He Lost His Baby : క‌మెడియ‌న్ అవినాశ్. ఈయ‌న్ను ఇలా ఎవ్వ‌రూ గుర్తుప‌ట్ట‌రు. ముక్కు అవినాశ్ అన‌గానే ఠ‌క్కున గుర్తుప‌ట్టేస్తారు. జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో ద్వారా ప‌రిచ‌యం అయిన అవినాశ్.. ఆ త‌ర్వాత బిగ్ బాస్, మ‌రికొన్ని కామెడీ షోలు చేసి అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా మంచి క్యారెక్ట‌ర్లు చేస్తున్నారు. అయితే, ఆ ఛాన్సులు రావ‌డానికి తాను చాలా క‌ష్ట‌ప‌డ్డాన‌ని చెప్పాడు అవినాశ్. ఇక ఈ మ‌ధ్య త‌న జీవితంలో జ‌రిగిన ఒక సంఘ‌ట‌న గురించి చెప్పి బాధ‌ప‌డ్డారు ఆయ‌న‌. ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాలు అన్నీ చెప్పారు అవినాశ్. ఆయ‌న ఏమ‌న్నారంటే? 


ఇప్ప‌టికీ సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతాను.. 


క‌మెడియ‌న్ గా కెరీర్ మొద‌లుపెట్టిన అవినాశ్.. ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా క‌నిపిస్తున్నారు. క‌మెడియ‌న్ గా త‌న‌దైన ముద్ర వేసుకుంటున్నారు. అయితే, ఆ ఛాన్సులు అంత ఈజీగా రాలేదు అంటున్నారు అవినాశ్. త‌ను ఇప్ప‌టికీ సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతాన‌ని చెప్పుకొచ్చారు. "నేను ఇప్ప‌టికీ సినిమా ఆఫీస్ ల‌కి వెళ్తుంటాను. ఎంతో కొంత పేరు వ‌చ్చింద‌ని ఇంట్లోనే కూర్చుని ఉండ‌లేం. ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు వ‌చ్చేశారు. మ‌నం ఇంట్లో కూర్చుంటే, గ్యాప్ వ‌చ్చేస్త‌ది. అందుకే, డైరెక్ట‌ర్ల‌కి, కో - డైరెక్ట‌ర్ల‌కి, మేనేజ‌ర్ల‌కి కాల్ చేస్తూ ఉంటాను. నేను అడుగుతాను వాళ్ల‌ని. కానీ, కొంత‌మంది మాత్రం అవినాష్ కోసం క్యారెక్ట‌ర్ రాద్దాం అని రాస్తున్నారు. అది నా అదృష్టంగా భావిస్తున్నాను" అని చెప్పారు. 


క్యారెక్ట‌ర్ ఇచ్చి.. ఫోన్ ఎత్త‌లేదు.. 


"ఒక సినిమాలో పెద్ద క్యారెక్ట‌ర్ ఇచ్చి త‌ర్వాత ఫోన్ ఎత్త‌లేదు డైరెక్ట‌ర్. బెల్లం కొండ సాయిగారి సినిమాలో చాలా పెద్ద క్యారెక్ట‌ర్ మిస్ అయ్యింది. ఆ డైరెక్ట‌ర్ నాకు చాలా క్లోజ్ ఇద్ద‌రం క‌లిసి ట్రావెల్ చేశాం. ఆ క్యారెక్ట‌ర్ క‌చ్చితంగా నువ్వే చేయాలి అన్నాడు. షెడ్యూల్ కి కూడా స్టార్ట్ అయిపోయింది. రేపు షూటింగ్ కి వెళ్లాలి. కానీ, ఒక్క‌సారిగా అత‌ను ఫోన్ లిఫ్ట్ చేయ‌లేదు. ఎందుకంటే.. ప్రొడ్యూస‌ర్ ద్వారా ఆ క్యారెక్ట‌ర్ వేరే వాళ్ల‌కి వెళ్లిపోయింది. జ‌బ‌ర్ద‌స్త్ కి ముందు నేను ఎవ్వ‌రికీ తెలీదు. ఆ త‌ర్వాతే అంద‌రికీ తెలిసింది. 2009లో స్టార్ట్ చేస్తే 2014లో ఛాన్స్ వ‌చ్చింది. అంత‌కు ముందు చాలా  అంటే చాలా క‌ష్టాలు ప‌డ్డాం. తినేందుకు తిండి ఉండేది కూడా కాదు. నెత్తికి పెట్టుకునే కొబ్బ‌రి నూనెతో వంట చేసుకుని తినేవాళ్లం. దొంగ‌త‌నంగా చాలా పెళ్లిల‌కి వెళ్లి తిన్నాం. అలా ఆక‌లి తీర్చుకున్నాం" అని చెప్పారు అవినాశ్. 


డాక్ట‌ర్ కాళ్లు ప‌ట్టుకుని ఏడ్చేశాను.. 


ఈ మ‌ధ్య అవినాశ్ ఇంట్లో ఒక విషాదం చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. అవినాశ్ కి బాబు పుట్టి మ‌ర‌ణించాడు. దీంతో అవినాశ్, అను ఇద్ద‌రు డిప్ర‌ష‌న్ లోకి వెళ్లిపోయారు. దీనిపై మొద‌టి సారి స్పందించారు అవినాశ్. "20 వ తారీఖు వ‌స్తే 5 నెల‌లు అవుతాయి. కోలుకోవ‌డానికి టైం ప‌డుతుంది. ఒక్కొక్క‌రు ఒక్కోలా మాట్లాడుతున్నారు. మా జాగ్ర‌త్త‌లో మేము ఉన్నాం. కొంత‌మందికి త‌ల‌రాత‌. చాలామందికి ఫ‌స్ట్ టైం అలా అవుతుంది అంట‌. తెల్లారితే డెలివ‌రీ. కానీ, ముందు రోజు రాత్రి బేబీ హార్ట్ బీట్ ఆగిపోయింది. ఉమ్మ‌నీరు త‌గ్గిపోవ‌డం లాంటివి జ‌రిగాయి. డాక్ట‌ర్స్ కి కూడా స‌రైన రీజ‌న్ తెలీదు. అప్పుడు స్టేజ్ మీద షూటింగ్ లో ఉన్నా. అక్క‌డ నుంచి ఉప్ప‌ల్ వెళ్లి.. హాస్పిట‌ల్ కి వెళ్లి డాక్ట‌ర్ కాళ్ల మీద ప‌డ్డాను. ఎలాగైన బ‌తికించండి అని వేడుకున్నాను. అర్ధ‌రాత్రి రోడ్డు మీద ప‌డి ఏడుస్తూ తిరిగాను. బాబు నాలానే ఉన్నాడు. క‌ర్లీ హెయిర్. త‌ట్టుకోలేక పోయాను. 2.75 కేజీలు పుట్టాడు. ఇక ఆ బాధ నుంచి బ‌య‌ట ప‌డేందుకు కొంచెం టైం ప‌ట్టింది మాకు. వీళ్లంతా స‌పోర్ట్ ఇచ్చారు. బ్లెసింగ్స్ ఇచ్చారు. చాలా క‌ల‌లు క‌న్నాము. కొడుకు పుడితే ఏ పేరు పెట్టాలి? కూతురు పుడితే ఏ పేరు పెట్టాలి? అని చాలా అనుకున్నాం. కానీ, అలా జ‌రిగిపోయింది" అంటూ బాధ‌ప‌డ్డారు అవినాశ్.



Also Read: బాలీవుడ్‌లోకి అనన్య నాగళ్ల - నటిగా కాదు రచయితగా.. ఏ మూవీకో తెలుసా?