Tirupati News: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఓ వృద్దురాలు ఛాలెంజింగ్ ఓటు వేశారు. సర్కారు సినిమాలో దళపతి విజయ్ మాదిరిగా అధికారులతో మాట్లాడి ఛాలెంజింగ్ ఓటు సాధించారు. తాను పోలింగ్ బూత్‌ వద్దకు వెళ్లేసరికి తన ఓటు వేరే ఎవరో వేసేశారు. దీనిపై అధికారులను ఆమె నిలదీశారు. దీంతో అధికారులు ఆమెకు ఛాలెంజింగ్ ఓటు హక్కు కల్పించారు. 


తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని చంద్రగిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 141 పోలింగ్ బూత్‌లో ఈ ఘటన జరిగింది. ఓ వృద్దురాలు పోలింగ్ స్టేషన్‌కు వెళ్లేసరికి తన ఓటు వేరే వాళ్లు వేసినట్టు గుర్తించారు. ఆ పేరుతో ఉన్నది తానేనని అధికారులతో చర్చించారు. దీనికి అవసరమైన ఆధారాలు చూపించారు. దీంతో అధికారులు ఆమెకు ఛాలెంజింగ్ ఓటు వేసే హక్కు కల్పించారు. 


ఛాలెంజింగ్ ఓటు ఎలా సాధించాలి?
ఎన్నికల టైంలో చాలా ప్రాంతాల్లో చాలా మంది ఓట్లు వేరే వాళ్లు వేసి ఉంటారు. ఓటు వేరే వాళ్లు వేసిన తర్వాత అసలైన హక్కు దారు మరోసారి ఓటు వేసేందుకు వీలు ఉండదు. అలాంటి టైంలోనే ఈ ఛాలెంజింగ్ ఓట్‌ను పొందొచ్చు. పోలింగ్ కేంద్రంలోని ప్రిసైడింగ్ అధికారిని సంప్రదిస్తే టెండర్‌ ఓటు లేదా ఛాలెంజింగ్ ఓటు హక్కు కల్పిస్తారు. 


ఈ ఛాలెంజింగ్ ఓటు కల్పించే టైంలో ఆ ప్రిసైడింగ్‌ అధికారులు అనేక ప్రశ్నలు అడుగుతారు. దానికి తగ్గ ఆధారాలు మీరు సమర్పంచాల్సి ఉంటుంది. ఆయన అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇస్తే ఆయన సంతృప్తి చెందింతే మీకు టెండర్ ఓటు హక్క ఇస్తారు. 


అధికారి ప్రత్యేక పరిస్థితుల్లో కల్పించే టెండర్‌ ఓటు ఈవీఎంలో వేయడానికి వీలు ఉండదు. ప్రత్యేకంగా ముద్రించిన బ్యాలెట్‌ పేపర్‌పై వేయాల్సి ఉంటుంది. ఆ పేపర్ వెనుకాల టెండర్ ఓటింగ్ అని రాసి ఇస్తారు. ఇలా ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ఇరవై వరకు బ్యాలెట్‌లు ఉంటాయి. అంతకు మించి ఎక్కువ అవసరం అయితే రిటర్నింగ్ అధికారి అనుమతితో సెక్టోరియల్‌ అధికారి ద్వారా బ్యాలెట్‌లు తెప్పించుకుంటారు. 


ఇలా పొందిన ప్రత్యేక బ్యాలెట్‌ పేపర్‌లో ఆ నియోజకవర్గంలో పోటీ పడుతున్న అభ్యర్థుల వివరాలు, గుర్తులు ఉంటాయి. దాన్ని ప్రత్యేక ఛాంబర్‌లోకి వెళ్లి నచ్చిన వ్యక్తికి ఓటు వేసి నిలువుగా, గుర్తులు బయటకు కనిపించకుండా ఉండేలా మడతపెట్టి అక్కడే ఉన్న ప్రిసైడింగ్ అధికారికి ఇవ్వాలి. 


టెండర్‌ బ్యాలెట్‌ను తీసుకున్న అధికారి దాన్ని జాగ్రత్తగా మడతపెట్టి ప్రత్యేక కవర్‌లో భద్రపరుస్తారు. పోలింగ్ ముగిసిన తర్వాత అలాంటి బ్యాలెట్‌లు ఎన్ని వచ్చాయో అన్నింటినీ కలిపి ఒకదగ్గర పెట్టి సీల్ చేస్తారు. ఇలా తీసుకొచ్చిన వాటిని ప్రత్యేక పరిస్థితుల్లో లెక్కిస్తారు.