Narsaraopet And Vijayawada News: కృష్ణా , గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. పోలింగ్ కేంద్రాలను సరళిని పరిశీలించేందుకు వెళ్తున్న నేతలపై ప్రత్యర్థులు దాడులు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కవ్వింపు చర్యలు దిగుతున్నారు. ఇది పరిస్థితిని హీటెక్కిస్తోంది. 
పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయులు టీంపై వైసీపీ లీడర్లు దాడి చేశారు. దొండపాడులోని పోలింగ్ సరళి పరిశీలించేందుకు వెళ్లిన ఆయనపై వైసీపీ లీడర్లు మూకుమ్మడిగా దాడి చేశారు. ఆయన కార్లు ధ్వంసం చేశారు. 




వైసీపీ దాడితో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పోలీసులు అక్కడే ఉన్న అడ్డుకోలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో దాడులకు ఛాన్స్ లేదని... అంతా ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలనిడిమాండ్ చేశారు. 




లావుకృష్ణదేవరాయులపై దాడిని టీడీపీ నేతలు ఖండించారు. ఈ దాడిలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఓడిపోతున్నామనే భయంతోనే వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని మండిపడుతున్నారు. 




ఎన్టీఆర్‌ జిల్లాలోని కంభంపాడు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్‌ల సందర్శనకు వెళ్లిన విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని(కేశినేని శివనాథ్‌) బృందంబై వైసీపీ లీడర్లు దాడి చేశారు. ఆయన వస్తున్న కార్లపై రాళ్ల దాడి చేశారు. 




ముందస్తు ప్లాన్ ప్రకారమే వైసీపీ శ్రేణులు దాడులు చేస్తున్నారని పోలీసులు మాత్రం నిలువరించే ప్రయత్నం చేయడం లేదని కేశినేని చిన్ని ఆరోపించారు. ఓడిపోతున్నామని తెలిసి ప్రజల్లో మద్దతు లేదని గ్రహించే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. ప్రజలంతా ఓటు వేసేలా పోలీసులు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నారు. అక్కడ అభ్యర్థినే రాణించని వైసీపీ శ్రేణులు స్వేచ్ఛగా ఓటు వేసే ఛాన్స్ ఇస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటివి ఎన్నికల సంఘం గమనించాలని విజ్ఞప్తి చేశారు.  


ఓడిపోతున్నామనే భయంతో దౌర్జన్యాలు: పంచుమర్తి అనురాధ
ఓడిపోతున్నామనే భయంతో వైసీపీ నాయకులకు ఏమి చేయాలో తెలియక దౌర్జన్యాలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. జరిగిన ఘటనలపై ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమండ్ చేశారు. సోమవారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ" నాలుగున్నర ఏళ్లు ప్రజల్ని వైసీపీ నాయకులు తిన్నారు. ఈ రోజు కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర మా ఏజెంట్లపై దాడులు చేస్తున్నారు. ఓడిపోతున్నామని తెలిసిపోయి అర్థంకాని పరిస్థితుల్లో మా ఏజెంట్లపై దాడులు చేస్తున్నారు. 


చిత్తూరు జిల్లా పుంగనూరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో కోడాలి నాని అనుచరులు రౌడీలకే రౌడీలన్నట్లు హల్ చల్ చేశారు. ఓటర్ల తలుపులు బాది, అందరూ వైసీపీకే ఓటు వేయాలని ఓటర్లను భయబ్రాంతులకు గురి చేశారు.  


మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ దైర్జన్యాలు, అరాచకాలే.  రెంటచింతలలో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ శ్రేణుల దాడి చేశారు. ఇద్దరికి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. నలుగురు ఏజెంట్లు గాయపడ్డారు. పార్వతీపురంలో ఏకంగా రిగ్గింగ్ చేస్తున్నారు. వీటిపై ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలి" అని అనురాధ డిమాండ్ చేశారు.