Misleading Food Labelling: ఫుడ్ ప్యాకెట్స్‌పై ఉన్న లేబుల్స్ అన్నీ నిజమే అని నమ్మొద్దంటూ ICMR హెచ్చరించింది. ఫుడ్ లేబులింగ్‌పై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఓ ఫుడ్ ప్యాకెట్‌ని తీసుకునే ముందైనా కచ్చితంగా దానిపై ఉన్న సమాచారాన్ని జాగ్రత్తగా చదవాలని సూచించింది. కొన్ని సంస్థలు లేబుల్స్‌ విషయంలో వినియోగదారుల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని అసహనం వ్యక్తం చేసింది. ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ విక్రయిస్తున్న సంస్థలు తమ ఉత్పత్తులు చాలా ఆరోగ్యకరమైనవని ప్రచారం చేసుకుంటున్నాయని హెచ్చరించింది. షుగర్ ఫ్రీ ప్రొడక్ట్స్‌లో కొవ్వు స్థాయి విపరీతంగా ఉంటుందని, ప్యాక్డ్‌ ఫ్రూట్ జ్యూస్‌లలో కేవలం 10 మాత్రమే నిజంగా జ్యూస్ ఉంటుందని మిగతా అంతా ఫ్లేవర్స్ యాడ్ చేస్తారని స్పష్టం చేసింది. ఆహార నాణ్యత విషయంలో FSSAI కఠినమైన నిబంధనలు విధించినప్పటికీ లేబుల్స్‌లో మాత్రం సంస్థలు మిస్‌లీడ్ చేస్తున్నాయని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కి చెందిన  National Institute of Nutrition తో కలిసి ICMR గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఏ ఆహార పదార్థంలో అయినా కృత్రిమంగా ఫ్లేవర్స్, రంగులు కలపకుండా ఉంటేనే అది "Natural" కేటగిరీ కిందకు వస్తుందని వివరించింది. అంటే ఎక్కువగా ప్రాసెసింగ్ లేని ఫుడ్‌నే ఈ కేటగిరీలో చేర్చుతారు. కానీ..కొన్ని కంపెనీలు ఎలాంటి ప్రమాణాలు పాటించకుండానే న్యాచురల్ అనే లేబుల్‌ని తగిలించుకుంటున్నాయని మండి పడింది ICMR. అందుకే వినియోగదారులు లేబుల్‌పై ఉన్న ఇన్‌గ్రీడియెంట్స్ వివరాలను కచ్చితంగా పరిశీలించాలని సూచించింది. 


ఫ్రూట్ జ్యూస్‌లలో 10% కూడా నిజమైన పండ్ల రసం ఉండడం లేదని,వాటిని కూడా రియల్ ఫ్రూట్ జ్యూస్ అంటూ విక్రయిస్తున్నారని ICMR అసహనం వ్యక్తం చేస్తోంది. ఇందులో పండ్ల రసం కన్నా ఎక్కువగా షుగర్ కంటెంట్ ఉంటోందని వివరించింది. ఇక ఆర్గానిక్ ఉత్పత్తులపైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్‌, కలర్స్, ఫ్లేవర్ల్ లేనప్పుడే ఆ ఫుడ్ ప్రొడక్ట్‌ని ఆర్గానిక్‌గా పరిగణించాలని...అదే విధంగా సహజ ఎరువులతో పండించిన వాటినే ఈ కేటగిరీలో చేర్చాలని స్పష్టం చేసింది. అలాంటప్పుడే ప్యాకేజ్డ్‌ ఫుడ్‌పై 'Jaivik Bharat' లోగో ఉంటుందని వెల్లడించింది. ఇది FSSAI ఆమోదించిన లోగో అని తెలిపింది. షుగర్ ఫ్రీ ప్రొడక్ట్స్‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉండడం వల్ల డయాబెటిస్, ఊబకాయం సమస్యలు తప్పవని హెచ్చరించింది. date of manufacture, use-by date పట్ల జాగ్రత్తగా ఉండాలని వెల్లడించింది. ఎక్స్‌పైరీ అయిన ఫుడ్ ప్రొడక్ట్స్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించొద్దని తెలిపింది. ప్యాకెట్ బరువు గురించీ ICMR ప్రస్తావించింది. ఒకసారి ఎన్ని గ్రాములు వినియోగించాలో స్పష్టంగా చూడాలని, ఆ మేరకు వాడాలని స్పష్టం చేసింది. వండుకోవాల్సిన పద్ధతులపైనా ఈ మధ్యే గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఏయే పాత్రల్లో వండితే ఎంత పోషకాలు లభిస్తాయో వివరించింది. కుకర్‌, మట్టి పాత్రల్లో వండుకుంటే మంచిదని సూచించింది. ఎక్కువగా వేపుళ్లు తినడం వల్ల కొవ్వు పేరుకుపోయి గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని హెచ్చరించింది. 


Also Read: PM Modi: పాపం పాకిస్థాన్ వద్ద గాజులున్నాయో లేవో, మేమే తొడుగుతాం - ప్రధాని మోదీ సెటైర్లు