YSRCP Voting Videos Viral: పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తుండగా వీడియోలు తీయడం నిషిద్ధం. కానీ, కొందరు అధికార వైఎస్ఆర్ సీపీకి ఓటు వేస్తున్నట్లుగా వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రహస్యంగా ఉండాల్సిన ఓటు సమాచారాన్ని కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడం వివాదాస్పదం అవుతోంది. తాజాగా అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి నియోజకవర్గంలో కొత్తవారి పల్లిలో ఓటు వేస్తుండగా వైసీపీ నాయకులు వీడియో తీశారు. ఈవీఎంలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తున్న దృశ్యాన్ని చిత్రీకరించి వైరల్ చేస్తున్నారు. మరోవైపు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 11.84  శాతం పోలింగ్ నమోదు అయింది.


తిరుపతిలో దొంగ ఓట్లు
మరోవైపు, తిరుపతిలోని జగన్మాత స్కూలు 96, 97 బూతుల్లో దొంగ ఓట్లు వేస్తూ 5 మంది దొరికిపోయారు. వారిని వాలంటీర్ పిలుచుకొని వచ్చినా సదరు వాలంటీర్ ను అదుపులోకి తీసుకోకుండా పోలీసులు వదిలేశారని ఆరోపణలు వస్తున్నాయి. 


పోలింగ్ బూత్ ఎదుట ఫ్లెక్సీలు
తిరుపతిలో నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రాల సమీపంలో ఫొటోలతో వైసీపీ ప్రచారం చేస్తున్నారని టీడీపీ నాయకులు రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు. పోలింగ్ బూత్ ఎదుట వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను ఉంచి ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని ప్రచురించారు. ఆ ఫ్లెక్సీలపై ఎంపీ అభ్యర్థి గురుమూర్తి ఫోటో, ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి.


కడప జిల్లాలో కిడ్నాప్
కడప జిల్లా దళవాయి పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ నాయకులు జనసేన ఏజెంట్ రాజారెడ్డిని కిడ్నాప్ చేశారు. పోలింగ్ కేంద్రం లోపల నుండి బయటకు లాగి కొట్టి కిడ్నాప్ చేశారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహించి పోలింగ్ కేంద్రంలో వెళ్లి యంత్రాలను ధ్వంసం చేశారు. దీంతో పోలింగ్ నిలిచిపోయింది.