PM Modi on Pakistan:  పాక్ ఆక్రమిత కశ్మీర్‌ని (Pak Occupied Kashmir) భారత్‌లో కలిపేసుకుంటే పాకిస్థాన్ ఊరుకోదని, ఆ దేశం గాజులు తొడుక్కుని కూర్చోందని ఫరూక్ అబ్దుల్లా ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. అణుబాంబులకో దాడి చేస్తుందని హెచ్చరించారు. ఆ తరవాత కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ కూడా PoKపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఒకవేళ పాకిస్థాన్‌ గాజులు తొడుక్కుని లేకపోతే ఇప్పుడు తొడుగుతామంటూ సెటైర్లు వేశారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాక్ వద్ద గాజులు కూడా ఉన్నాయో లేవో అంటూ చురకలు అంటించారు. ఫరూక్ అబ్దుల్లా పేరు ప్రస్తావించకుండానే ఇలా వ్యంగ్యాస్త్రాలు సంధించారు మోదీ. ఇదే సమయంలో పాక్‌లోని ఆర్థిక పరిస్థితులపైనా సెటైర్లు వేశారు. 


"పాకిస్థాన్‌ ఒకవేళ గాజులు తొడుక్కుని లేకపోతే మేమే గాజులు తొడుగుతాం. ఆ దేశ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. పిండి దొరకడం లేదు. తిండి దొరకడం లేదు. విద్యుత్‌కీ నానా అవస్థలు పడుతున్నారు. వీటికి కొరత ఉందని తెలుసు. కానీ వాళ్ల దగ్గర గాజులు కూడా లేవని ఇప్పుడే అర్థమైంది"


- ప్రధాని మోదీ 


కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ చేసిన వ్యాఖ్యలు ఇటీవల వైరల్ అయ్యాయి. పాత వీడియో అయినప్పటికీ ఇప్పుడు వైరల్ అవడం వల్ల కాంగ్రెస్‌కి గట్టిగా షాక్ తగిలింది. ఆయన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని పార్టీ తేల్చిచెప్పింది. కానీ అప్పటికే బీజేపీ దాడులు మొదలు పెట్టింది. కాంగ్రెస్ దేశ పౌరుల్ని భయపెడుతోందని, ఈ వైఖరే సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందని మండి పడ్డారు. పాకిస్థాన్‌ వద్ద అణు బాంబులున్నాయని బెదిరిస్తున్నారని, వాళ్లకు ఆ బాంబులను ఏం చేసుకోవాలో అర్థం కావడం లేదని సెటైర్లు వేశారు. అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్థాన్‌ ఆ బాంబులు అమ్ముకునైనా డబ్బు సంపాదించాలని అనుకుంటోందని, కానీ...వాటి నాణ్యత సరిగ్గా లేకపోవడం వల్ల ఎవరూ కొనడం లేదని అన్నారు.