Telangana Budget 2023 : ఉచితాలను అవహేళన చేస్తున్న టైంలో ప్రజల కన్నీరు తుడిచేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రతిదాన్నీ లాభనష్టాలతో చూసేందుకు పరిపాలన వ్యాపారం కాదన్నారు. సంక్షేమ పథకాలను లాభనష్టాల దృక్పథంతో కాకుండా మానవాభివృద్ధి దృక్పథంతో చూడాలన్నారు. గత ప్రభుత్వం 200 పింఛన్ ఇచ్చేదని... దాన్ని ఇప్పుడు రూ.2,016 కు పెంచామన్నారు. దివ్యాంగులకు రూ.3,016 ఇస్తున్నామన్నారు. మానిఫెస్టోలో పేర్కొనక పోయినా... ఎవరూ డిమాండ్ చేయకపోయినా బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, ఫైలేరియా బాధితులకు, డయాలసిస్‌ పేషెంట్లకు 2,016 రూపాయలు పింఛన్‌ ఇస్తున్నామన్నారు. 2014లో పింఛన్లు పొందే లబ్ధిదారుల సంఖ్య 29,21, 828 ఉండేదని... వీరి కోసం ఏటా రూ.861 కోట్లు ఖర్చు అయ్యేదన్నారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక ఆసరా పింఛన్‌ లబ్ధిదారుల సంఖ్యను ప్రభుత్వం 44, 12, 882 మందికి పెంచామన్నారు. ఇప్పటి వరకు 54,989 కోట్ల రూపాయలను ఆసరా పింఛన్లు ఇచ్చామన్నారు. 


ఆసరా పింఛన్లకు రూ.12 వేల కోట్లు 


గత బడ్జెట్‌లో చెప్పిన విధంగా 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్‌ ఇస్తున్నామని మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ మేరకు 2022లో కొత్తగా 8,96,592 మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. ఈ ఆసరా పింఛన్ల కోసం ఈ బడ్జెట్‌లో రూ.12,000 కోట్లు ప్రతిపాదించారు మంత్రి హరీశ్ రావు. దళిత బంధుపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. దళిత జాతి స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే బలమైన సంకల్పంతో ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు వెల్లడించారు. అందుకే ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు. షెడ్యూల్‌ కులాల, తెగల అభివృద్ధికి ప్రత్యేక ప్రగతి నిధి అమలు చేస్తోందని, వారి జనాభాకు సరిపడా కేటాయింపులు చేసినట్టు పేర్కొన్నారు.  ఈసారి ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36,750 కోట్లు ప్రతిపాదించామన్నారు.  


షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి 


దళిత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అంబేడ్కర్ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ కింద రూ.20 లక్షల ఆర్థిక  సాయాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణ ఏర్పడే నాటికి ఎస్సీల కోసం రెసిడెన్షియల్‌ విశ్వవిద్యాలయాలు 134 ఉంటే... తెలంగాణ ఏర్పడిన తర్వాత 268కు పెంచామన్నారు. వీటిలో చదివే విద్యార్థుల సంఖ్య 1,55, 863కు చేరిందన్నారు. దళితుల గృహావసరాల  కోసం 101 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా ప్రభుత్వం అందిస్తున్నామన్నారు. దీని కోసం ఇప్పటి వరకు రూ.251 కోట్ల నిధులు ఖర్చు చేశామని ప్రకటించారు.  బడ్జెట్‌లో షెడ్యూల్‌ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద రూ.15,233 కోట్లు ప్రతిపాదించారు. 


బీసీ వర్గాల  సంక్షేమం


బడుగు బలహీన వర్గాల అభ్యన్నతి కోసం ప్రత్యేక పథకాలను రూపొందించామన్నారు మంత్రి హరీశ్ రావు. ఇప్పటి వరకు చేపట్టిన పథకాలను, సాధించిన విజయాలను వివరించిన హరీశ్ రావు... ఈసారి  బడ్జెట్‌లో రూ.6,229 కోట్లు ప్రతిపాదిస్తున్నట్టు వెల్లడించారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ కోసం ఈ బడ్జెట్లో రూ.3,210 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. మైనారిటీ కార్పొరేషన్ అందించే రుణాల కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.270 కోట్లు ఖర్చు చేయడానికి ప్రతిపాదించారు. గతేడాది కన్నా రూ.239 కోట్లు ఎక్కువని తెలిపారు. పేద ముస్లిం మహిళలకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 20 వేల కుట్టుమిషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మొత్తంగా మైనారిటీల సంక్షేమానికి రూ.2,200 కోట్లు ప్రతిపాదించామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.