Fire Accident In Nampally Today: హైదరాబాద్ నాంపల్లి బజార్ ఘాట్ లో సోమవారం ఉదయం 9:30కు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ రసాయన గోదాంలో అగ్ని ప్రమాదం జరిగి ఐదో అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో 9 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఓ చిన్నారి ఉన్నారు. కొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 6 ఫైరింజన్ల సాయంతో మంటలు అదుపులోకి తెస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న 15 మందిని అగ్ని మాపక సిబ్బంది రక్షించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 21 మంది అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వారిలో 8 మంది అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. వారందరినీ ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 



 


ప్రమాదానికి కారణం ఇదే


భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో గ్యారేజీ ఉండడంతో అందులో కారు రిపేర్ చేస్తుండగా మంటలు వ్యాపించాయి. సెల్లార్ లో డీజిల్, కెమికల్ డ్రమ్ములకు మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. గ్యారేజ్ లో ఉన్న మిగతా కెమికల్ డబ్బాలను అగ్ని మాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. నిచ్చెనల సాయంతో మంటల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. భవనంలోని చిన్నారులు, మహిళలను బయటకు తీసుకొస్తున్నారు. ఒక్కసారిగా భారీగా మంటలు చూసిన అపార్ట్ మెంట్ వాసులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.


బజార్ ఘాట్ లో ప్రమాద స్థలాన్ని డీసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. 'అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో గ్యారేజీ ఉంది. అక్కడ కారు రిపేర్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. డీజిల్, కెమికల్ డ్రమ్ములకు మంటలు అంటుకుని అపార్ట్ మెంట్ లో పై అంతస్తులకు మంటలు వ్యాపించాయి. 3, 4 అంతస్తుల్లో కొన్ని కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. అగ్ని ప్రమాదంతో పొగ వల్ల ఊపిరాడక కొందరు చనిపోయారు. ముగ్గురికి గాయాలయ్యాయి.' అని చెప్పారు.


Also Read: Malkajgiri News: దీపావళి వేడుకల్లో అపశ్రుతి - చీరకు నిప్పంటుకోగా భార్యను రక్షించబోయి భర్త మృతి