Yoga For Kidney stones : యోగా అనేది మనం మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపి.. మనల్ని హెల్తీగా ఉంచే ఓ ప్రక్రియ. అయితే కిడ్నీలో రాళ్ల వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గించుకోవడంలో కూడా యోగా తన ప్రత్యేకతను చాటుకుంటుంది. మూత్రపిండాల ఆరోగ్యాన్ని, పనితీరును మెరుగుపరిచే ఆసనాలు ఏవి? ఏయే ఆసనాల వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 


అసలు కిడ్నీల్లో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి?


మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి క్రిస్టల్ ఫార్మింగ్ పదార్థాలు అధికమొత్తంలో ఉన్నప్పుడు కిడ్నీలో రాళ్లు వస్తాయి. ఇవి మూత్రపిండాలను విడిచిపెట్టి.. మూత్ర ప్రవాహాన్ని అడ్డుకున్నప్పుడు దీనివల్ల భరించలేని నొప్పి కలుగుతుంది. ఈ రాళ్లు సన్నని ప్రవాహాల్లో చిక్కుకున్నప్పుడు అవి విపరీతమైన నొప్పిని, అసౌకర్యాన్ని ప్రేరేపిస్తాయి. దీని నుంచి రిలీఫ్ ఇవ్వడానికి మెడిసన్స్ ఉన్నాయి.


అయితే మెడిసన్స్​తో పాటు పలు యోగాసనాలు చేస్తే నొప్పినుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.  ఇవి నొప్పిని తగ్గించడంతో పాటు.. కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. అంతేకాకుండా కిడ్నీ సమస్యలు పునరావృతం కాకుండా సహాయం చేస్తాయి. ఇంతకీ ఏ ఆసనాల వల్ల కిడ్నీ రాళ్లవల్ల కలిగే నొప్పి తగ్గుతుందో చూద్దాం.


బాలాసనం..


ఈ స్ట్రెచ్ చేయడం చాలా సులభం. ఇది మంచి కిడ్నీ స్టోన్ రిలీఫ్ పొజిషన్​గా చెప్పవచ్చు. ఇది వీపు భాగంలో ఒత్తిడి తగ్గించి.. విశ్రాంతి ఇస్తుంది. 


మర్జర్యాసనం


దీనినే పిల్లి ఆవు భంగిమ అంటారు. దీనిని చేయడం కూడా చాలా సులభం. ఈ భంగిమలో చేసే కదలికలు మూత్రపిండాల చుట్టూ ఉండే కండరాలకు మంచి మసాజ్ అందిస్తాయి. అంతేకాకుండా వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయం చేస్తుంది. 


పశ్చిమోత్తనాసనం


ఈ ఆసనం చేయడం కూడా చాలా సులభం. దీనివల్ల ముందుకు వంగడం, వెనుక ఉన్న అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది. కిడ్నీ రాళ్ల వల్ల కలిగే నొప్పి నుంచి ఉపశమనం అందిస్తుంది. 


భుజంగాసనం


మీకు సూర్యనమస్కారాలు చేసే అలవాటు ఉంటే ఈ ఆసనం చేయడం చాలా తేలిక. ఒకవేళ మీకు అలవాటు లేకున్నా.. మీరు ఈ ఆసనం ఈజీగా చేయవచ్చు. దీనినే కోబ్రా ఆసనం అని కూడా అంటారు. ఇది వెన్నెముక వశ్యతను మెరుగుపరుస్తుంది. నొప్పి నుంచి ఉపశమనం అందిస్తుంది. 


బ్రిడ్జ్ ఫోజ్..


దీనినే సేతు బంధాసనం అని కూడా అంటారు. ఇది పొత్తికడుపు ప్రాంతంలో రక్తప్రసరణను ప్రోత్సాహిస్తుంది. తద్వార వెన్నెముక బలోపేతం అవుతుంది. ఇది క్రమంగా మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 


ఒంటె ఆసనం..


దీనినే యోగాలో ఉస్త్రాసనం అంటారు. ఇది కిడ్నీ స్టోన్ పెయిన్ రిలీఫ్​లో ప్రముఖమైన ఆసనంగా చెప్పవచ్చు. దీనిలో మనం చేసే బ్యాక్ బెండ్ పొజిషన్ శరీర ముందు భాగాన్ని విస్తరించి.. కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. 


శవాసనం


ఆసనాలన్నింటిలో ఈ ఆసనం చాలా సులువైనది. ఇది విశ్రాంతినిచ్చి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది మీ మొత్తం ఆరోగ్యానికి మంచిది. 


ఈ ఆసనాలు మీకు నొప్పి నుంచి ఉపశమనం అందిస్తాయి. కానీ మీరు కచ్చితంగా వైద్యులు సూచించిన మెడిసన్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. యోగా ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడం, లోతైన శ్వాసలు తీసుకోవడం వల్ల ప్రశాంతతను ఈ ఆసనాలు అందిస్తాయి. యోగాలో కూడా కొన్ని మెలితిప్పే, విపరీతంగా స్ట్రెచ్ చేసే ఆసనాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. మీరు ఈ ఆసనాలు ముందుగా యోగా నిపుణుల సమక్షంలో వేస్తే మరీ మంచిది.