సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్)లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. ఆత్మకూరు(ఎస్)లో బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు బాహాబాహీకి దిగారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టాయి. ఆత్మకూరు(ఎస్) ఐకేపీ కేంద్రం వద్ద ఈ ఉద్రిక్తత మరింత తీవ్రమయ్యింది. ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. బండి సంజయ్ గోబ్యాక్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. బండి సంజయ్‌ను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. నల్లజెండాలు ప్రదర్శిస్తూ నిరసన తెలిపాయి.
పరస్పర దాడులు
సూర్యాపేట జిల్లా చివ్వెంలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన ఉద్రిక్తత పరిస్థితుల్లో మధ్య ముగిసింది. బండి సంజయ్‌ను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం ఉదయమే చివ్వెంకు భారీగా తరలివచ్చారు. బండి సంజయ్ గోబ్యాక్ అంటూ టీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేయగా... భాజపా శ్రేణులు వారిని అడ్డుకున్నారు. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. రాళ్ల దాడిలో కానిస్టేబుల్ గాయపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ వర్గాలను అదుపుచేసేందుకు పోలీసుల ముమ్మరంగా యత్నించారు.
బండి సంజయ్ కు అమిత్ షా ఫోన్
ఉమ్మడి నల్గొండ జిల్లాలో బండి సంజయ్ పర్యటనలో యాదాద్రి భువనగిరి జిల్లా అర్వపల్లి సెంటర్‌లో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. తమ నాయకుడికి స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. సంజయ్ పర్యటనలో నిరసన తెలిపేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో వచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న బండి సంజయ్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ ఫోన్ చేశారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో బండి సంజయ్‌పై జరిగిన దాడి వివరాలను ఆరా తీశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు వెళ్తే టీఆర్ఎస్ నేతలు దాడికి పాల్పడ్డారని బండి సంజయ్ తెలియజేశారు.
Also Read: కేసీఆర్‌కి తెలంగాణ గురించి ఏం తెలుసు? అన్నీ డ్రామాలే.. ఆ విషయం ఒప్పుకున్నట్లేగా..
సోమవారం పర్యటనలో ఉద్రిక్తత
ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను పరిశీలించేందుకు బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన యాత్ర రణరంగంగా మారింది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో టీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ పర్యటనను అడుగడుగునా అడ్డుకున్నాయి. సోమవారం మిర్యాలగూడ పర్యటనలో రాళ్ల దాడి జరిగింది. దీంట్లో పలువురికి గాయాలయ్యాయి. సూర్యపేటలో బండి సంజయ్ కాన్వాయ్ వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. పరస్పర నినాదాలు, కోడిగుడ్లు, రాళ్లు రువ్వుకోవడంతో పర్యటన మొత్తం విధ్వంసకరంగా మారింది. మిర్యాలగూడ, శెట్టిపాలెం, చిల్లేపల్లి వంతెన, నేరేడుచర్ల, గరిడేపల్లి, గడ్డిపల్లి ప్రతి చోటా భారీగా టీఆర్ఎస్ శ్రేణులు బండి కాన్వాయ్‌ను అడ్డుకుంటూ ఆందోళనలు చేశారు.
బండి సంజయ్ పై కేసు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై కేసు నమోదైంది. అనుమతి లేకుండా పర్యటన చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని సంజయ్‌పై అభియోగం మోపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని నల్గొండ రూరల్, మాడగులపల్లి, వేములపల్లి పీఎస్‌లలో బండి సంజయ్ పై కేసులు నమోదు చేశారు.
Also Read: మాపై దాడులకు సూత్రధారి సీఎం కేసీఆరే.. బండి సంజయ్, ఉద్రిక్తతల మధ్యే రెండోరోజూ పర్యటన