వానా కాలం పంట కొనుగోలు చేయాలని కోరితే టీఆర్ఎస్ ప్రభుత్వం దాడులు చేస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తమపై దాడులకు టీఆర్ఎస్ పార్టీ చీఫ్ అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సూత్రధారి అని అన్నారు. బండి సంజయ్‌ సోమవారం నల్గొండ, మిర్యాలగూడలలో పర్యటన సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు రాళ్లు, టమాటాలు, చెప్పులు విసురుకున్నారు. బండి సంజయ్‌ కాన్వాయ్‌ పైనా దాడి జరిగిన సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను కలిసేందుకు మంగళవారం సూర్యాపేటలోని సంకినేని వెంకటేశ్వర రావు నివాసం నుంచి బయలుదేరిన బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.


సూర్యాపేట బస్టాండ్ వద్ద బండి సంజయ్ కుమార్ వాహనాన్ని అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించారు. కోడిగుడ్లు, టమాటాలతో దాడికి సిద్ధమైనట్లు సమాచారం. రెండో రోజు కూడా బండి సంజయ్ పర్యటన ఉద్రిక్తతల మధ్యే కొనసాగుతోంది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. తన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ముందుగానే పోలీసులకు ఇచ్చామని, అయినా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు. తమ పర్యటనను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పోలీసుల తీరుపై విమర్శించారు. స్వయంగా ముఖ్యమంత్రే శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్నారని ఆక్షేపించారు.


వానాకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనేంత వరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఫాం హౌస్ నుంచి బయటకు రావడం లేదని విమర్శించారు. సమస్యలను పరిష్కరించాలని వారే ధర్నాలకు దిగడం, దాడులకు పాల్పడటం దారుణమని అన్నారు. నిన్న టీఆర్ఎస్ చేసిన దాడిలో 8 వాహనాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. 


‘‘సీఎం కేసీఆర్‌ బయటకు రారు.. ప్రగతి భవన్‌కే పరిమితం అయ్యారు. సమస్యలు పరిష్కరించాల్సిన వారే ధర్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ దాడుల్లో 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. మా పర్యటన షెడ్యూల్‌ ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. బీజేపీని అడ్డుకునేందుకు టీఆర్ఎస్ యత్నిస్తుందని తెలిసినా చర్యలు తీసుకోలేదు. సీఎం కేసీఆరే శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్నారని అన్నారు. వానాకాలం పంటను కొనుగోలు చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు.’’ అని బండి సంజయ్‌ తేల్చి చెప్పారు.