AP Telangana Breaking News: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు.. ఏపీ నుంచి ఇద్దరికి పురస్కారం
లోకల్ టు గ్లోబల్ ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా వెంటనే చూసేందుకు ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేయండి
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పురస్కారాలకు దేశవ్యాప్తంగా 44 మంది టీచర్లను కేంద్రం ఎంపిక చేసింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఎంపికయ్యారు.
విశాఖపట్నం జిల్లా లింగరాజుపాలెం హైస్కూల్‌కు చెందిన ఉపాధ్యాయుడు భూషణ్ శ్రీధర్.. చిత్తూరు జిల్లాలోని ఎం పాయిపల్లి ఐరాల హైస్కూల్ టీచర్ మునిరెడ్డిని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వరించాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనంపైకి డంపర్ ఎక్కడంతో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మృతులను సింగరేణి కార్మికులు సాగర్, పాషా, ప్రైవేట్ వాహనం డ్రైవర్ వెంకన్నగా గుర్తించారు. జిల్లాలోని మణుగూరు ఓసి-2లో ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.
అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ మరో అవకాశం ఇచ్చింది. రేపటి(ఆగస్టు 19) లోపు తమ వివరాలు అందివ్వాలని సూచిస్తోంది.
అగ్రిగోల్డ్ డిపాజిటర్లు తమ వివరాలును మరోసారి సరిచూసుకోవాలని చెబుతోంది ఆంధ్రప్రదేశ్ సీఐడీ. గురవారం సాయంత్రంలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెబుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 6 నుంచి డిపాజిటర్ల వివరాలను సేకరణ కొనసాగుతోంది. రూ. 20 వేలలోపు డిపాజిట్ చేసిన బాధితులు తమ వివరాలను సరిచూసుకోవచ్చని సీఐడీ తెలిపింది.
డబ్బు చెల్లించిన అసలు రసీదులతో వాలంటీర్ల వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. వాలంటీర్ల వద్ద వీలు కాకపోతే ఎంపీడీవో కార్యాలయంలో పత్రాలు ఇవ్వాలని తెలిపింది.
సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి వచ్చిన వార్తలపై భారత్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొలీజియం సమావేశాలపై మీడియాకు లీకులు రావడం దురదృష్టకరమమని అన్నారు. ఊహాగానాలు సరికావని వ్యాఖ్యానించారు.
పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ నవీన్ సిన్హాకు వీడ్కోలు చెప్పే వేదికపై మాట్లాడని జస్టిస్ ఎన్వీ రమణ న్యాయమూర్తుల నియామక ప్రక్రియ పవిత్రమైనదన్నారు. దాని పవిత్రత అర్థం చేసుకొని మీడియా గౌరవంగా మెలగాలని సూచించారు.
"మీడియాలో వచ్చే ఊహాగానాలు, రిపోర్ట్స్‌పై కొంచెం స్వేచ్ఛ తీసుకొని మాట్లాడదామనుకుంటున్నాను. న్యాయమూర్తులను నియమించాల్సిన అవసరం మీ అందరికీ తెలుసు. ఆ ప్రక్రియ కొనసాగుతోంది. సమావేశాలు జరుగుతున్నాయి. జరుగుతాయి. నిర్ణయాలు తీసుకుంటారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియ పవిత్రమైంది. దానికి కొంత గౌరవం ఉంది. మీడియా మిత్రులు ప్రక్రియ పవిత్రత అర్థం చేసుకొని రిపోర్ట్ చేయాలని కోరుతున్నాను."
సుప్రీం కోర్టులో వారం పదిరోజుల్లో ప్రత్యక్ష వాదనలు ప్రారంభంకానున్నాయి. దీన్ని పరోక్షంగా ప్రస్తావించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ కొత్త టారిఫ్ ఆర్డర్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఆఫ్‌లైన్ కోర్టు ప్రొసీడింగ్స్‌పై జస్టిస్ రమణ రియాక్ట్ అయ్యారు. కొత్తటారిఫ్ బొంబాయి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్ సుప్రీంలో పటిషన్ వేసింది. ఇదే ఇవాళ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగానే కోర్టు ప్రొసీడింగ్స్ అంశం ప్రస్తావనకు వచ్చింది.
కరోనా ఎఫెక్ట్ అయినప్పటి నుంచి సుప్రీంకోర్టు సహా దేశంలోని చాలా కోర్టులు ఆన్‌లైన్‌లో నడుస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనే వాదనలు వింటూ తీర్పులు చెబుతున్నాయి.
మొహర్రం నెల 10వ రోజు ఇచ్చే సాధారణ సెలవును ఆగస్టు 19 నుంచి 20వ తేదీకి మారుస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొహర్రం 9వ రోజు ఇచ్చే ఆప్షనల్ సెలవును ఆగస్టు 18 నుంచి 19వ తేదీకి మార్చారు. నెలవంక ఆధారంగా మొహర్రం నెల ఒకరోజు ఆలస్యంగా ప్రారంభమైందని, కాబట్టి సెలవులను కూడా మార్చాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు కోరడంతో మార్పు చేసినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని మండలం పెసలబండలో విషాదం జరిగింది. చింతాల్ మునిస్వామి రథోత్సవంలో అపశృతి దొర్లింది. కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
ఉదయం రథోత్సవం నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది. రథం లాగుతున్న టైంలో విద్యుత్ తీగలకు తగిలి షాక్ కొట్టింది. వీరంజనేయులు, వెంకటేష్ మృతి చెందారు. గాయపడిన వారిని ఆదోని ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ కూకట్ పల్లిలోని అల్విన్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటీరియర్ డిజైనర్ దుకాణంలో మంటలు చెలరేగాయి. వెంటనే షాపు మొత్తం మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున అగ్ని కీలలు పైకి ఎగిసిపడ్డాయి. ఇంతలో ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే, అంతలోనే షాపు మొత్తం తగలబడిపోయింది. మంటలు పైకి ఎగసిపడడంతో విద్యుత్ వైర్లు కూడా కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు తలెత్తినట్లుగా పోలీసుల, అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా భావిస్తున్నారు.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నకిలీ సీఐగా చెలామణి అవుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మంలో సర్కిల్ ఇన్స్‌పెక్టర్ అని చెప్పుకుంటూ ఓ వైద్యుడిని నిందితుడు బెదిరించాడు. అతని నుంచి ఏకంగా రూ.75 లక్షలు డిమాండ్ చేశాడు. నకిలీ పోలీసును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తెలంగాణలో కరోనా రెండో వేవ్‌లో నమోదైన కేసుల్లో డెల్టా వేరియంట్‌కు చెందిన మరో ఐదు సబ్ వేరియంట్‌లు వ్యాప్తి చెందినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. హైదరాబాద్, జోగులాంబ గద్వాలలో నాలుగు రకాల డెల్టా వేరియంట్లు ఉన్నట్లుగా గుర్తించారు. జగిత్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో 3 రకాల సబ్ వేరియంట్లు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. గత నెలలో వచ్చిన కొత్త కరోనా కేసుల్లో ఏవై-12 రకానికి చెందిన వేరియంట్ కేసులే నమోదయ్యాయని వైద్య నిపుణులు వెల్లడించారు.
దర్శకరత్న దాసరి నారాయణ రావు కుమారుడు అరుణ్‌పై అట్రాసిటీ కేసు నమోదైంది. బొల్లారం వాసి నర్సింహులు ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు ఈ కేసు పెట్టారు. 2012-16 మధ్య నర్సింహులు దాసరి దగ్గర సినిమాల రిస్టోరేషన్ పనులు చేశారు. దాసరి చనిపోయాక ఆయన ఇవ్వాల్సిన డబ్బుల దగ్గర ఆయన కుమారులు అరుణ్, ప్రభుతో వివాదం ఏర్పడింది. ఈ క్రమంలో తనను కులం పేరుతో అరుణ్ దూషించినట్లుగా నర్సింహులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తల్లి కృష్ణ కుమారి మరణం పట్ల బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. గవర్నర్ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు. కృష్ణకుమారి ఆత్మకు శాంతి చేకూరాలని బండి సంజయ్ ప్రార్థించారు.
ఆర్థిక మంత్రి హరీశ్ రావు గవర్నర్ తల్లి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తల్లి మరణంతో శోక సముద్రంలో ఉన్న గవర్నర్ కుటుంబానికి హరీశ్ రావు సానుభూతి వ్యక్తం చేశారు. కృష్ణ కుమారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తల్లి కృష్ణ కుమారి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కరీబియన్ ద్వీప దేశం హైతీలో సంభవించిన భారీ భూకంపం ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకూ 1,941 మంది మృతిచెందారని, ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మరో 6 నుంచి 7 వేల మంది గాయపడ్డారని తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ భూకంపంతో తీవ్ర ఆర్థిక, ప్రాణ నష్టం సంభవించింది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు మాతృవియోగం కలిగింది. ఆమె తల్లి కృష్ణ కుమారి తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 80 ఏళ్లు. ఇటీవల కృష్ణ కుమారి అస్వస్థతకు గురి కాగా.. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం ఆమె చనిపోయారు. కాసేపట్లో కృష్ణ కుమారి భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి చెన్నైకి తరలించనున్నారు. మాజీ ఎంపీ కుమారి నందన్ భార్య అయిన కృష్ణకుమారికి గవర్నర్ తమిళిసై పెద్ద కుమార్తె.
Background
జగిత్యాల జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోరుట్ల పట్టణంలోని ఆనంద్ షాపింగ్‌లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని దాదాపు రెండు గంటలుగా మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. షాపింగ్ మాల్ మొత్తం నాలుగు అంతస్తులు ఉండగా.. మొత్తం భవనమంతా వ్యాపించాయి. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లుగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం సరకు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తునే నష్టం జరిగినట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు.
Also Read: Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర.. స్వల్పంగా పెరిగిన వెండి.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలివే..
- - - - - - - - - Advertisement - - - - - - - - -