TS Assembly : తెలంగాణ అసెంబ్లీ గవర్నర్ ప్రసంగంలో పలు మార్పులు సూచించారు గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్. వాస్తవాలకు దగ్గరగా ఉండాలని ప్రశాంత్ రెడ్డికి గవర్నర్ సూచించినట్లుగా తెలుస్తోంది. గవర్నర్ సూచనలకు ఒకే చెప్పిన మంత్రి ప్రశాంత్ రెడ్డి మార్పులు చేయడానికి అంగీకరించారు. ఉన్న వాస్తవాలనే ప్రసంగంలో ఉంటాయని శాసనసభ వ్యవహారాల మంత్రి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 3వ తేదీన ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి శుక్రవారం మధ్యాహ్నం 12:10 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అటు ప్రభుత్వం ఇటు గవర్నర్ ఓ అంగీకారానికి రావడంతో ఉభయ సభలను ఉద్దేశిస్తూ గవర్నర్ చేసే ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఏర్పడిన వివాదం హైకోర్టు వరకు వెళ్లినా.. ఇరువర్గాల మధ్య ఒప్పందంతో సద్దుమణిగింది. కోర్టు సూచనల మేరకు.. బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టడానికి గవర్నర్ అనుమతి ఇచ్చేలా, సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం అంగీకరించేలా ఏర్పాటు జరిగింది. మరోవైపు గవర్నర్ తీరును బీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. రాజ్‌భవన్లను రాజకీయ కేంద్రాలుగా మారుస్తున్నారన్నారు మంత్రి కేటీఆర్. ఇప్పటికీ గవర్నర్ తీరుపై కొంత మంది విమర్శలు గుప్పిస్తున్నారు.
పుదుచ్చేరి పర్యటన ముగించుకున్న హైదరాబాద్ తిరిగి వచ్చిన గవర్నర్ తమిళి సైని మంత్రి ప్రశాంత్‌రెడ్డి కలిశారు. బడ్జెట్ ప్రతిపాదనకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం తరఫున గవర్నర్ ను కోరారు. బడ్జె్ట్ సమావేశాల్లో ప్రసంగించేందుకు రావాల్సిందిగా గవర్నర్ తమిళి సై ను ఆహ్వానించారు. ఉభయ సభల ప్రోరోగ్, తిరిగి సమావేశమయ్యేందుకు నోటిఫికేషన్, గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిఫారసు అంశాలపై గవర్నర్ తో చర్చించారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన స్పీచ్ కాపీని మంత్రి గవర్నర్ కు అందించారు. పెండింగ్ బిల్లుపై చర్చకు గవర్నర్ ఆమోదం తెలిపారు. తెలంగాణ బడ్జెట్ 2023-24కు గవర్నర్ ఆమోదం లభించింది. మూడు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు నిన్న తెరపడినా... ఆమోదంపై సస్పెన్స్ మాత్రం కొనసాగింది. మొత్తానికి మూడు లక్షల కోట్లతో రూపొందించిన తెలంగాణ పద్దుపై గవర్నర్ తమిళిసై సంతకం చేసి ఆమోదించారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ టెర్మ్‌లో ప్రవేశ పెడుతున్న ఆఖరి బడ్జెట్ ఇది. అందుకే భారీ అంచనాలు ఉన్న బడ్జెట్‌పై కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టారని తెలుస్తోంది.
. గతంలో రెండుసార్లు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈసారి కూడా గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని భావించినా చివరికి ఆ నిర్ణయాన్ని మార్చుకుంది ప్రభుత్వం. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ స్పీచ్ ఉంటుందని తెలిపింది. ఈ మేరకు గవర్నర్ ను బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించారు. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తేదీని ఖరారు చేసింది. ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, 3వ తేదీ మధ్యాహ్నం గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 6న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.