బాలీవుడ్ ఇండస్ట్రీకి బ్యాడ్ లక్కో... ఇంకొకటో కానీ రెండేళ్లు నుంచి గడ్డు కాలాన్ని ఎదుర్కొంది. ఒక్కటంటే ఒక్క సరైన హిట్ లేదు. 'బ్రహ్మాస్త్ర'కు ఉత్తరాదిలో హిట్ టాక్ వచ్చినా, ఆ సినిమా చూసి దక్షిణాది ప్రేక్షకులు పెదవి విరిచారు. హిందీలో మంచి వసూళ్ళు వచ్చాయి. అయితే, బాలీవుడ్‌కు ఊపిరి పోయలేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన 'లాల్ సింగ్ చడ్డా' లాంటి సినిమాలు సైతం కొంచెం కలెక్షన్లు వసూలు చేశాయి. ఇటువంటి తరుణంలో వచ్చిన షారుఖ్ ఖాన్ బాలీవుడ్ కష్టాలను దూరం చేసేశాడు. 


ఐదు రోజుల్లో 'పఠాన్'కు 542 కోట్లు
తనను బాలీవుడ్ బాద్ షా అని ఎందుకు పిలుస్తారో తెలియని వాళ్ళకు 'పఠాన్'తో అర్థం అయ్యేలా చేశాడు షారూఖ్ ఖాన్. బాక్సాఫీస్ బరిలో ఆయన వసూళ్ల సునామీ అలాంటి ఇలాంటిది కాదు. ఐదు రోజుల్లోనే ఏకంగా 542 కోట్ల రూపాయల మార్క్ చేరుకుంది సినిమా. అంతే కాదు... ఈ ఘనత సాధించటంలో 'బాహుబలి', 'కేజీఎఫ్ 2' రికార్డులను తుడిచి పెట్టేశాడు కింగ్ ఖాన్. 


రూ. 500 కోట్ల మార్కును 'కేజీఎఫ్ 2' ఏడు రోజుల్లో అందుకుంటే... 'బాహుబలి 2'కి ఎనిమిది రోజులు పట్టింది. దర్శక ధీరుడు రాజమౌళి లేటెస్ట్ మాస్టర్ పీస్ RRR మాత్రమే మూడు రోజుల్లో 500 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ఈ లిస్టులో షారూఖ్ కంటే ముందుంది. సరే 'ఆర్ఆర్ఆర్' విడుదలైనప్పుడు ఉన్న పరిస్థితులు వేరు... షారూఖ్ ఖాన్ 'పఠాన్' విడుదలైన పరిస్థితులు వేరు. 


వివాదాల మధ్యలో వసూళ్ళ సునామీ
'పఠాన్' సినిమా విడుదలకు ముందు షారుఖ్ ఖాన్ ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. తన కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) ను డ్రగ్స్ కేసులో NCB అధికారులు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి షారూఖ్ ఏం చేసినా వివాదమే. 'పఠాన్' టైటిల్ నుంచి షారూఖ్ లుక్, సినిమాలోని 'బేషరమ్ రంగ్' పాటలో దీపికా పదుకోన్ ధరించిన బికినీ రంగు, సోషల్ మీడియాలో బాయ్ కాట్ పఠాన్ ట్రెండ్స్... ఒక్కటి కాదు, బోలెడు ఫేస్ చేశారు. కొన్ని ఏరియాల్లో థియేటర్లలో స్క్రీనింగ్ కానివ్వకుండా కొందరు అడ్డు పడ్డారు. పోస్టర్లను తగులబెట్టారు. ఘర్షణలకు దిగారు. సెన్సార్ విషయంలోనూ కొంత ఇబ్బంది పడ్డారు. విజయాలు లేక షారుఖ్ కూడా బ్రేక్ తీసుకున్నారు.
 
బోలెడు ప్రతికూల పరిస్థితుల నడుమ విడుదలైన 'పఠాన్' తొలి రోజు నుంచి షారూఖ్ ఖాన్ రేంజ్ ఏంటో ప్రపంచానికి చెబుతోంది. రోజుకు 60 నుంచి 70 కోట్ల రూపాయల కలెక్షన్లు కొల్లగొడుతోంది. దీపికా పదుకోన్, జాన్ అబ్రహంతో కలిసి మల్టీస్టారర్ చేశానంటున్న షారూఖ్ ఖాన్... దీపికాను అమర్, తనను అక్బర్, జాన్ అబ్రహంను ఆంథోనీగా అభివర్ణించాడు. రూ. 500 కోట్ల రూపాయల మార్కును అందుకున్న సందర్భంగా నిర్వహించిన స్పెషల్ మీడియా మీట్ లో తన మనసులో ఉన్న మాటలను బయట పెట్టారు. 


Also Read : మహేష్ మూవీ ఓటీటీ రైట్స్ @ 80 కోట్లు!


సినిమా హిట్ లేదా ఫ్లాప్... ఏదైనా ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. తనను, దీపికాను, జాన్ అబ్రహంను మూడు వేర్వేరు మతాలకు చెందిన  వ్యక్తులుగా, దేశం కోసం పోరాడే వాళ్లగా చూడమనటం షారూఖ్ అనుభవించిన వేదనకు నిదర్శనమని చెబుతున్నారంతా! వ్యక్తిగతంగా, వృత్తిపరంగా షారుఖ్ ఖాన్‌కు ఇది పెద్ద ఊరట. ఒక విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ఈ సినిమా ఊపిరి పోసింది. అందుకే చాలా రిలాక్స్డ్ గా తనదైన మార్క్ మేనరిజం ను ప్రదర్శిస్తూ ఈవెంట్ ను ఎంజాయ్ చేశారు షారూఖ్. కొందరు ఈ సినిమాను తొక్కేయాలని చూస్తే... వసూళ్ళ సునామీతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ విరుచుకు పడింది.  


Also Read : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్