ఆస్కార్ బరిలో (Oscar Nominations 2023) 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' సినిమా మిగతా సినిమాలు అన్నిటినీ వెనక్కి నెట్టి మరీ ముందంజలో ఉంది. ఆ సినిమాకు 11 నామినేషన్స్ వచ్చాయి. టామ్ క్రూజ్ 'టాప్ గన్ : మావెరిక్'కు 6 నామినేషన్స్ వచ్చాయి. ఇంకా ఉత్తమ సినిమా కేటగిరీలో 'అవతార్ : ద వే ఆఫ్ వాటర్' కూడా ఉంది. ఆస్కార్ బరిలో ఉన్న ఈ సినిమాలను కాదని మరీ మన 'ఆర్ఆర్ఆర్' (RRR Movie Latest Award) కు ఆడియన్స్ ఓటు వేయడంతో ఈ అవార్డు వచ్చింది. ఆ అవార్డు ఏంటి? అనే వివరాల్లోకి వెళితే...
'ఆర్ఆర్ఆర్'కు గోల్డెన్ టమోటో అవార్డు!
హాలీవుడ్‌లో 'రొట్టెన్ టమోటో' అని వెబ్‌సైట్ ఉంది. సినిమాలను ఏకి పారేయడం ఆ వెబ్‌సైట్ స్టైల్. అందులో ప్రతి సినిమాకు ప్రేక్షకులు రేటింగ్ ఇస్తూ ఉంటారు. ఆ వెబ్‌సైట్ ప్రతి ఏడాది మంచి సినిమాలకు అవార్డులు కూడా ఇస్తూ ఉంటుంది. ప్రేక్షకులు వేసిన ఓటింగ్ ఆధారంగా అవి ఇస్తారు. ఈసారి 'గోల్డెన్ టమోటో' మన 'ఆర్ఆర్ఆర్'కు వచ్చింది. రెండో స్థానంలో 'టాప్ గన్', మూడో స్థానంలో 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' ఉన్నాయి. నాలుగో స్థానంలో 'ద బ్యాట్ మ్యాన్', ఐదో స్థానంలో 'అవతార్ 2' నిలిచాయి.
రెండో వారం నుంచి 'ఆర్ఆర్ఆర్'కు పెరిగిన ఓట్లు!
తొలి వారంలో 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' సినిమాకు ఎక్కువ ఓట్లు వచ్చాయని... అయితే, రెండో వారం నుంచి 'ఆర్ఆర్ఆర్'కు అనూహ్యంగా ఓట్లు పెరిగాయని రొట్టెన్ టమోటో సైట్ వెల్లడించింది. భారతీయ సినిమాకు మరో అవార్డు రావడంతో ఇక్కడి ప్రేక్షకులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
ఆస్కార్ మీదే అందరి దృష్టి!?
ఇప్పుడు భారతీయ ప్రేక్షకులు అందరి దృష్టి ఆస్కార్స్ మీద ఉంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 'నాటు నాటు...' నామినేట్ కావడంతో దానికి అవార్డు వస్తుందా? లేదా? అని దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ & మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read : టాలీవుడ్‌ను వణికించిన జనవరి 27 - ఒక షాక్ తర్వాత మరొక షాక్
ఆస్కార్ అవార్డు కంటే ముందు కీరవాణిని పద్మశ్రీ పురస్కారం వరించడం... దానికి కొన్ని రోజుల ముందు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడంతో ఆస్కార్ కూడా రావడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. ఇటీవల జపాన్ గడ్డ మీద సైతం 'ఆర్ఆర్ఆర్' సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
జపాన్‌లో దిగ్విజయంగా వంద రోజులు ఆడింది. ఈ విషయాన్ని దర్శక ధీరుడు రాజమౌళి వెల్లడించారు. గత ఏడాది అక్టోబర్ 21న అక్కడ సినిమా విడుదల అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటికీ ప్రేక్షకులు సినిమా చూస్తూనే ఉన్నారు. 42 కేంద్రాల్లో నేరుగా... 114 కేంద్రాలో షిఫ్ట్ ల వారీగా 100 రోజులను పూర్తి చేసుకుంది 'ఆర్ఆర్ఆర్'. ఇండియా, అమెరికా తర్వాత ఆ స్థాయిలో మన సినిమాను జపాన్ ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు.
Also Read : సమంతకు అండగా దర్శకుడు - అవన్నీ పుకార్లే