రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో విజ్ఞాన్ ప్రైవేట్ పాఠశాల స్కూల్ బస్సును కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. సిరిసిల్ల వచ్చే దారిలో వెనక నుండి ఢీకొనగా 20 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. రెండు ఒకే వైపు నుండి వస్తున్నాయని, ఆర్టీసీ బస్ డ్రైవర్ స్కూల్ బస్సును ఢీకొనడంతోనే పెద్ద శబ్దం వచ్చిందని స్థానికులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు గాయపడ్డ పిల్లలను హుటాహుటిన అక్కడే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులను బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ప్రమాదంలో దాదాపు 15 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అతివేగంతో ఆర్టీసీ బస్సు దూసుకు వచ్చి స్కూలు బస్సును ఢీ కొట్టిందని సంఘటన స్థలంలో ఉన్న స్థానిక వ్యక్తులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులోని పిల్లలకు గాయాలు అయ్యాయి. ఆ దెబ్బలకు తట్టుకోలేక వారు బావురుమన్నారు. ముఖం, యూనిఫాంపై రక్తపు మరకలు కనిపించాయి. పిల్లలు ఏడుస్తున్న ఫోటోలు దయనీయంగా ఉన్నాయి. ఓ విద్యార్థి తన తోటి విద్యార్థికి అయిన గాయాలను చూపుతూ చేసిన రోదన అక్కడున్న వారిని కలచివేసింది.
ప్రమాదం ధాటికి స్కూలు బస్సు అద్దాలు సైతం పగిలిపోయాయి. ఆ గాజు పెంకుల వల్లే విద్యార్థులకు కాస్త గాయాలు అయినట్లుగా భావిస్తున్నారు. పెద్ద గాయాలు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
విద్యార్థుల పరిస్థితిపై మంత్రి కేటీఆర్ ఆరా
రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలంలో స్కూల్ బస్సు ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో ఫోన్ ద్వారా మంత్రి కేటీఆర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే విద్యార్థులను హైదరాబాద్ కి తరలించి వైద్యం అందించాలని మంత్రి కేటీఆర్ సూచించారు.