Lucknow Pitch:  భారత్- న్యూజిలాండ్ మధ్య 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్ లక్నో వేదికగా జరిగింది. ఇక్కడి అటల్ బిహారీ వాజ్ పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. స్పిన్ బౌలర్లకు పిచ్ బాగా సహకరించింది. ఈ మ్యాచ్ లో ఒక్క సిక్స్ కూడా నమోదకపోవడం గమనార్హం. దీంతో ఈ పిచ్ పై చర్చ జరిగింది. 


ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 99 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే 100 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ కూడా చాలా కష్టపడింది. సూర్యకుమార్, హార్దిక్ పాండ్య చివరి వరకు నిలబడి ఆఖరి ఓవర్లో విజయాన్ని అందించారు. న్యూజిలాండ్ జట్టు మరో 20 పరుగులు అదనంగా చేసి ఉంటే భారత్ కు గెలుపు కష్టమయ్యేదే. మ్యాచ్ ముగిశాక ఇరు జట్ల కెప్టెన్లు పిచ్ పై అసంతృప్తి వ్యక్తంచేశారు. టీ20 ఫార్మాట్ కు ఈ పిచ్ పనికిరాదని హార్దిక్ పాండ్య అన్నాడు. ఈ పిచ్ షాకింగ్  గా ఉందని.. 120 పరుగుల లక్ష్యమైతే తాము కాపాడుకునేవారమని కివీస్ కెప్టెన్ శాంట్నర్ తెలిపాడు. 


పిచ్ క్యురేటర్ పై వేటు


టీ20 క్రికెట్ కు అనుకూలంగా పిచ్ తయారు చేయనందుకు లక్నో పిచ్ క్యురేటర్ ను తొలగించారని సమాచారం. ఈ ఏడాది ఐపీఎల్ కోసం ఇక్కడ కొత్త పిచ్ ను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ టీం లక్నో సూపర్ జెయింట్స్ కు ఇది హోం గ్రౌండ్. కాబట్టి ఈ ఏడాది ఐపీఎల్ లో కనీసం 7 మ్యాచ్ లు ఈ మైదానంలో జరుగుతాయి. అలాగే వుమెన్స్ ప్రీమియర్ లీగ్ లో లక్నో జట్టుకు కూడా ఇదే హోం గ్రౌండ్. 


లక్నో పిచ్ పై మేం ఫిర్యాదు చేయలేం


బ్యాటర్లకు కఠినంగా మారిన లక్నో పిచ్ పై న్యూజిలాండ్ యువ ఆల్ రౌండర్ మైఖెల్ బ్రాస్ వెల్ స్పందించాడు. 'నిజమే. ఇది టీ20 పిచ్ కాదు. దీనిపై మేం ఫిర్యాదు చేయలేం. అయితే కొన్నిసార్లు మనం నేర్చుకోవడానికి, మన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఇలాంటివి అవకాశాలుగా మారతాయి. విభిన్న వికెట్లపై ఆడడానికి మనం మార్గాలు కనుక్కోవాలి. అన్ని వేళలా ఫ్లాట్ పిచ్ లపై ఆడితే మన నైపుణ్యాలకు నిజమైన పరీక్ష లభించదు.' అని బ్రాస్ వెల్ అన్నాడు.