ఆయన జిల్లాకు కలెక్టర్. ఐఏఎస్ అధికారి. మామూలుగా ఐఏఎస్ అధికారి అంటే ఎవరు సివిల్ సర్వీస్ ఆఫీసర్. ప్రజాసేవ చేయాలి. ఈ విషయంలో నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీకి క్లారిటీ ఉంది . తాను ప్రజలకు సేవ చేస్తా.. ఉద్యోగులు తనకు సేవలు చేయాలని ఆయన తీర్మానించుకున్నారు. ఆయన ప్రజలకు ఎంత మేర సేవ చేస్తారో కానీ.. తనకు సేవ చేయాల్సిన ఉద్యోగులకు మాత్రం డ్యూటీలు వేసేశారు. ఆ సేవ పూర్తిగా వ్యక్తిగత సేవ. ఆయన ప్రజా సేవలో అలసి సొలసి వచ్చి అటలాడుతూంటే.. ఆయనకు బాల్స్ అందించాలన్నమాట. 
 
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీకి  ( Nirmal Collector ) టెన్నిస్ అంటే ఇష్టం. రోజూ టెన్నిస్ ఆడనిదే ఆయనకు గడవదు. అందుకే ఓ టెన్నిస్ కోర్టు ( Tennis Court ) కూడా సిద్ధం చేయించుకున్నారు. రోజూ కొంత మందితో కలిసి ఆడుతూ ఉంటారు. అయితే.. ఇటీవల ఆయనకు ఓ సమస్య వచ్చింది.. అదేమిటంటే బాల్స్ అందించే వారు లేకపోవడం. దీంతో ఆయన టెన్నిస్‌పై ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు. దీర్ఘంగా ఆలోచించి వెంటనే తలసీల్దార్‌ను పిలిచి సమస్యకు పరిష్కారం  చెప్పాడు. అదేమింటే..  వీఆర్‌ఏలు ఖాళీగానే ఉన్నారని వారిని బాల్ బాయ్స్‌గా వాడుకోవచ్చన్నారు.  తహసీల్దార్‌కు కూడా ఐడియా నచ్చింది. 


వెంటనే ఆయన ఆఫీస్‌కు వెళ్లి వీఆర్‌ఏల ( VRA ) లిస్ట్ బయటకు తీసి టెన్నిస్ ఆటపై ప్రాధమిక అవగాహన ..  బాల్స్ సరిగ్గా అందించే చురుకుదనం ఉన్న వీఆర్ఏలను లిస్ట్ అవుట్ చేసి 21 మందిని ఖరారు చేశారు. వెంటనే వారికి వారం పాటు విధులు ఖరారు చేస్తూ రోస్టర్ తయారు చేశారు. ఆ ప్రకారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు . అందులో చాలా స్పష్టంగా చెప్పారు...  కలెక్టర్ టెన్నిస్ ఆట కోసం బాల్ బాయ్స్‌గా పని చేయాలని.  రోజుకు ముగ్గురు చొప్పున వారం రోజులకు ఇరవై ఒక్క మందిని ఎంపిక చేశారు. వారు తమకు కేటాయించిన రోజుల్లో కరెక్టల్ గారు టెన్నిస్ అడుతూంటే బాల్స్ అందించాలి. 


నిజానికి ఇలాంటి సేవలు ఏవైనా అనధికారికంగా చేయించుకుంటూ ఉంటారు. ఎందుకంటే అలా ఉద్యోగుల్ని ఇళ్లల్లో పనులకు వాడుకోవడం తప్పు. చట్టం అంగీకరించదు. అయితే ఈ చట్టాలన్నిఅమలు చేసేది మేమే కాబట్టి  తమకేం ఇబ్బంది అనుకున్నారో కానీ కలెక్టర్, తహశీల్దార్  ఏ మాత్రం ఆలోచించలేదు. అధికారిక ఉత్తర్వులు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు వీరిద్దరి తీరు చర్చనీయాంశం అవుతోంది.