IPL 2022  Ravindra Jadeja game changer catch: ఐపీఎల్‌ 2022లో ఐదో మ్యాచులో తొలి విజయం అందుకుంది చెన్నై సూపర్‌ కింగ్స్‌. వరుసగా నాలుగు ఓడిపోవడంతో ఆ జట్టుపై అంచనాలు తగ్గిపోయాయి. అభిమానుల్లో నిరాశపెరిగింది. అయితే ఐదో మ్యాచులో గెలవడంతో మళ్లీ విజిల్‌ పొడు బ్యాచులో జోష్‌ పెరిగింది. నిజానికి 210+ స్కోరు చేసినా ఆఖరి వరకు సీఎస్‌కేకు గెలుపుపై నమ్మకం కలగలేదు. అందుకు కారణం దినేశ్‌ కార్తీక్‌!


ఆర్‌సీబీకి 217 పరుగుల టార్గెట్‌ ఇచ్చినప్పటికీ సీఎస్‌కే అంత ఈజీగా గెలవలేదు. ఆఖరి వరకు టెన్షన్‌ పడింది. 50కే 4 వికెట్లు కోల్పోయిన బెంగళూరుకు షాబాజ్‌ అహ్మద్‌, ప్రభుదేశాయ్‌ 33 బంతుల్లోనే 60 పరుగుల చక్కని  భాగస్వామ్యం అందించారు. జట్టును పోటీలో నిలిపారు. మరికాసేపటికే వారిద్దరూ ఔటయ్యారు. 16 ఓవర్లకు ఆర్సీబీ 146/8తో నిలిచింది. ఇలాంటి సిచ్యువేషన్‌లో ఎవరికైనా గెలుపుపై ఆశలు ఉంటాయి. ఈజీగా గెలుస్తామన్న నమ్మకం ఉంటుంది. కానీ సీఎస్‌కే అలా అనిపించలేదు. ఆఖరి వరకు వారు ఒత్తిడిలోనే ఉన్నారు. అన్‌కంఫర్టబుల్‌గా కనిపించారు. ఎందుకంటే దినేశ్ కార్తీక్‌ విధ్వంసకరంగా ఆడుతున్నాడు.


వరుసగా సిక్సర్లు, బౌండరీలు కొట్టిన డీకే 17వ ఓవర్లో 23 పరుగులు పిండేశాడు. అందుకే 18వ ఓవర్లో సీఎస్‌కే ఓ అద్భుమైన ప్రణాళిక వేసింది. బంతిని ఎలా వేసినా డీకే కొట్టేస్తాడు. అతడున్న ఫామ్‌ అలాంటిది మరి. అందుకే బౌండరీ సరిహద్దులు దూరంగా ఉన్న ఎండ్‌ను టార్గెట్‌గా ఎంచుకున్నారు. లాంగాన్‌, మిడాన్‌, ఫైన్‌ లైగ్‌ ప్రాంతాల్లో ఫీడ్లర్లను మోహరించారు. వైవిధ్యంగా బౌలింగ్‌ చేసే డ్వేన్‌ బ్రావోకు బంతినిచ్చింది. అతడు లెగ్‌వికెట్‌ లక్ష్యంగా బంతులేశాడు. లోయర్‌ ఫుల్‌టాస్‌గా వేసిన రెండో బంతిని డీకే పెద్ద బౌండరీ అయిన డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా సిక్సర్‌ బాదేందుకు ప్రయత్నించాడు. సరిగ్గా బౌండరీ లైన్‌ వద్ద ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డరైన జడ్డూ ఆ బంతిని ఒడిసి పట్టాడు. దాంతో అతడు అక్కడే మైదానంపై పడుకొని సేద తీరాడు. అప్పటికి గానీ మ్యాచ్‌ గెలుస్తామన్న నమ్మకం రాలేదు అతడికి. అందుకే సీఎస్‌కే విజయానికి అన్నిటి కన్నా ముఖ్యంగా ఈ క్యాచే దోహదం చేసింది.




RCB ఛేదన ఎలా సాగిందంటే?


IPL 2022: ఐపీఎల్‌ 2022లో ఎట్టకేలకు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ (Chennai Superkings) తొలి గెలుపు  అందుకుంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Banglore)పై 23 పరుగుల తేడాతో విజయం అందుకుంది. 217 పరుగుల టార్గెట్‌ను రక్షించుకుంది. ఆర్సీబీని 193/9కి పరిమితం చేసింది. బెంగళూరులో ప్రభుదేశాయ్‌ (34; 18 బంతుల్లో 5x4, 1x6), షాబాజ్‌ (41; 27 బంతుల్లో 4x4), దినేశ్ కార్తీక్‌ (34; 14 బంతుల్లో 2x4, 3x6) టాప్‌ స్కోరర్లు. అంతకు ముందు సీఎస్‌కేలో శివమ్‌ దూబె (95; 46 బంతుల్లో 5x4, 8x6), రాబిన్‌ ఉతప్ప (88; 50 బంతుల్లో 4x4, 9x6) చితకబాదారు.


భయపెట్టిన డీకే


భారీ టార్గెట్‌ ఛేదించే క్రమంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. సీఎస్‌కే పవర్‌ప్లేను స్పిన్నర్లతో వేయించడమే ఇందుకు కారణం. 14 వద్దే డుప్లెసిస్‌ (8) ఔటయ్యాడు. 20 వద్దే విరాట్‌ కోహ్లీ (1)ని ముకేశ్‌ ఔట్‌ చేశాడు. 42 వద్ద అనుజ్‌ రావత్‌ (12) ఔటయ్యారు. రాగానే (26; 11 బంతుల్లో 2x4, 2x6) ధనాధన్‌ బౌండరీలు బాదేసినా జడ్డూ అతడిని క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దాంతో 50కే ఆర్‌సీబీ 4 వికెట్లు చేజార్చుకుంది. ఈ సిచ్యువేషన్లో షాబాజ్‌ అహ్మద్‌తో కలిసి కొత్త కుర్రాడు ప్రభుదేశాయ్‌ బౌండరీలు బాదేశాడు. వరుస బౌండరీలు బాదేసి 33 బంతుల్లో 60 పరుగుల భాగస్వామ్యం అందించాడు. సూపర్‌గా ఆడుతున్న అతడిని 12.2 బంతికి తీక్షణ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. 133 వద్ద షాబాజ్‌ను తీక్షణ ఔట్‌ చేయడంతో భారం దినేశ్‌ కార్తీక్‌పై పడింది. అందుకు తగ్గట్టే అతడు సిక్సర్లతో సీఎస్‌కేను భయపెట్టాడు. 17.2 బంతికి బ్రావో అతడిని ఔట్‌ చేయడంతో ఆర్‌సీబీ ఓటమి ఖరారైంది. 193/9కు పరిమితమైంది.