IPL 2022: ఐపీఎల్ 2022లో ఎట్టకేలకు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ (Chennai Superkings) తొలి గెలుపు అందుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Banglore)పై 23 పరుగుల తేడాతో విజయం అందుకుంది. 217 పరుగుల టార్గెట్‌ను రక్షించుకుంది. ఆర్సీబీని 193/9కి పరిమితం చేసింది. బెంగళూరులో ప్రభుదేశాయ్ (34; 18 బంతుల్లో 5x4, 1x6), షాబాజ్ (41; 27 బంతుల్లో 4x4), దినేశ్ కార్తీక్ (34; 14 బంతుల్లో 2x4, 3x6) టాప్ స్కోరర్లు. అంతకు ముందు సీఎస్‌కేలో శివమ్ దూబె (95; 46 బంతుల్లో 5x4, 8x6), రాబిన్ ఉతప్ప (88; 50 బంతుల్లో 4x4, 9x6) చితకబాదారు.
భయపెట్టిన డీకే
భారీ టార్గెట్ ఛేదించే క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. సీఎస్‌కే పవర్‌ప్లేను స్పిన్నర్లతో వేయించడమే ఇందుకు కారణం. 14 వద్దే డుప్లెసిస్ (8) ఔటయ్యాడు. 20 వద్దే విరాట్ కోహ్లీ (1)ని ముకేశ్ ఔట్ చేశాడు. 42 వద్ద అనుజ్ రావత్ (12) ఔటయ్యారు. రాగానే (26; 11 బంతుల్లో 2x4, 2x6) ధనాధన్ బౌండరీలు బాదేసినా జడ్డూ అతడిని క్లీన్‌బౌల్డ్ చేశాడు. దాంతో 50కే ఆర్‌సీబీ 4 వికెట్లు చేజార్చుకుంది. ఈ సిచ్యువేషన్లో షాబాజ్ అహ్మద్‌తో కలిసి కొత్త కుర్రాడు ప్రభుదేశాయ్ బౌండరీలు బాదేశాడు. వరుస బౌండరీలు బాదేసి 33 బంతుల్లో 60 పరుగుల భాగస్వామ్యం అందించాడు. సూపర్‌గా ఆడుతున్న అతడిని 12.2 బంతికి తీక్షణ క్లీన్‌బౌల్డ్ చేశాడు. 133 వద్ద షాబాజ్‌ను తీక్షణ ఔట్ చేయడంతో భారం దినేశ్ కార్తీక్‌పై పడింది. అందుకు తగ్గట్టే అతడు సిక్సర్లతో సీఎస్‌కేను భయపెట్టాడు. 17.2 బంతికి బ్రావో అతడిని ఔట్ చేయడంతో ఆర్‌సీబీ ఓటమి ఖరారైంది. 193/9కు పరిమితమైంది.
శివమ్, ఉతప్ప దంచుడే దంచుడు
నిజానికి చెన్నై సూపర్ కింగ్స్‌కు కోరుకున్న ఆరంభమేమీ దక్కలేదు. జట్టు స్కోరు 19 వద్ద రుతురాజ్ గైక్వాడ్ (17) ఔటయ్యాడు. 36 వద్ద మొయిన్ అలీ (3) రనౌట్ అయ్యాడు. పవర్‌ప్లేలో ఆ జట్టుకు 35 పరుగులే లభించాయి. ఎప్పుడైతే శివమ్ దూబె వచ్చాడో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బెంగళూరు స్పిన్నర్ల బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. లాగిపెట్టి సిక్సర్లు బాదేశాడు. 30 బంతుల్లోనే 50 పూర్తి చేశాడు. మరోవైపు రాబిన్ ఉతప్ప సైతం అతడికి జత కలిశాడు. 33 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. పది ఓవర్లు ముగిశాక వీరిద్దరూ ప్రత్యర్థికి చుక్కలు చూపించారు. ప్రతి ఓవర్‌కు సగటున 1౩-15 పరుగులు రాబట్టారు. బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. మూడో వికెట్‌కు 74 బంతుల్లో 165 పరుగుల భాగస్వామ్యం అందించారు. దాంతో 16.2 ఓవర్లకు 150, 18.3 ఓవర్లకు 200 స్కోరు దాటేసింది. సెంచరీకి చేరువైన ఉతప్ప, రవీంద్ర జడేజాను హసరంగ ఔట్ చేశాడు. దూబె మాత్రం ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. సెంచరీకి కొద్ది దూరంలో ఆగిపోయాడు. హర్షల్ పటేల్ లేని లోటు బెంగళూరును బాగా వేధించింది.