Supreme Court Adjourned BRS Mla Kavtha Petition on ED summons: ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (Mlc Kavitha) ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. తుది విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోరగా.. గతంలో వేర్వేరు కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులు, రికార్డులను పరిశీలించాల్సి ఉందంటూ కేసును ధర్మాసనం ఈ నెల 16కు వాయిదా వేసింది. కాగా, గత విచారణ సందర్భంగా నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీల కేసులతో ఈ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం జత పరిచిన విషయం తెలిసిందే.


కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన దర్యాప్తు సంస్థ.. మరికొందరికి నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సైతం ఈడీ ప్రశ్నించింది. అయితే, మరోసారి విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇవ్వగా కవిత గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళల విచారణలో సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ ఆమె సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.


'సమన్లు జారీ చేయమని చెప్పారు'


కవిత పిటిషన్ పై సోమవారం విచారణ సందర్భంగా.. కవిత సమన్లు తీసుకోవడం లేదని, విచారణకు రావడం లేదని ఈడీ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో కవిత తరఫు న్యాయవాది కపిల్ సిబల్ జోక్యం చేసుకుంటూ సమన్లు ఇక జారీ చేయబోమని గత విచారణలో చెప్పారని అన్నారు. అయితే, అది ఒక్కసారికే పరిమితమని.. ప్రతీసారి కాదని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలో ఈడీ నోటీసులే చట్ట విరుద్ధమని.. తుది విచారణ చేపట్టాలని కపిల్ సిబల్ న్యాయస్థానాన్ని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. ఆ రోజు విచారణలో అన్ని విషయాలు పరిశీలిస్తామని జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం స్పష్టం చేసింది.


Also Read: Telangana Budget: బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి 20 వేల కోట్లు కేటాయించాలి - మంత్రి భట్టికి ఎమ్మెల్సీ కవిత లేఖ