Southwest Monsoon Arrives in Andhra Pradesh: ఎండవేడి.. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది.  ఆదివారం నుంచి రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.  ఐఎండి సూచనల ప్రకారం వచ్చే రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ, కర్ణాటక, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. నైరుతి రుతుపవనాలు రాయలసీమలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది.


ఆదివారం (జూన్ 2న) నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరులోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. సోమవారం నుంచి ఈ రుతుపవనాలు ఏపీలో మరింతగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఎండల తీవ్రత, వేడిగాలుల కారణంగా గత కొద్ది రోజులుగా ప్రజలు అల్లాడిపోతున్నారు. నైరుతి రుతుపవనాల రాకతో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ జోరుగా వానలు కురవడంతో ప్రజలు రిలాక్స్ అవుతున్నారు. 


భారీ వర్షాలకు ఛాన్స్
కోస్తాంధ్రలో  ఆవర్తనం విస్తరించి ఉందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో రాగల నాలుగు రోజులు పలు ప్రాంతాల్లో భారీవర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్‌ వెల్లడించారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. 


తెలంగాణలో మూడు రోజులు జాగ్రత్త
తెలుగు రాష్ట్రాల్లో  ఆదివారం (జూన్ 2) మధ్యాహ్నం నుంచి వరుసగా మూడు రోజుల పాటు  వర్షాలు దంచి కొడతాయని వాతావరణ శాఖ  పేర్కొంది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి. మీ వేగంతో ఈదరుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.  తెలంగాణలో హైదరాబాద్, సిద్ధిపేట,  భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అత్యవసర పనులు అయితే తప్పా బయటకు వెళ్ల కూడదని హెచ్చరించింది.  గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరుగకుండా  జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి విపత్తులు ఎదురైనా సరే ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నారు.  నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ,గద్వాల్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


హైదరాబాదులో భారీ వర్షం
రాజధాని నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం లో ఓ మోస్తారు వర్షం కురిసింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ గాలులకు ఇళ్ల పై కప్పులు కూడా లేచిపోయాయి.  జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. జగిత్యాల జిల్లా కోరుట్ల లో ఈదురు గాలులు పిడుగులతో కూడిన భారీ వర్షం పడింది. పలు చోట్ల పిడుగు పాటుకు చెట్లు నేలకొరిగాయి.


ఏపీలో పిడుగులకు అవకాశం
ఏపీ విషయానికి వస్తే..  ఆదివారం నైరుతి రుతు పవనాలు కేరళా తీరాన్ని తాకాయి.  ఈ ప్రభావంతో ఆంధ్రాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అల్లూరి సీతారామారాజు, శ్రీ సత్యసాయి, పార్వతీపూరం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.   అలాగే ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు,  కోనసీమ, శ్రీకాకుళం, బాపట్ల, ప్రకాశం,  అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో పాటు ఓ మోస్తారు వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.  వర్షాల కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ ఐఎండీ హెచ్చరించింది.