AP Election Results 2024 | విజయవాడ: దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత శనివారం సాయంత్రం పలు ప్రముఖ మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం సాధిస్తుందని పలు సంస్థల ఎగ్జిట్ పోల్ సర్వేలో వచ్చింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి రాకపోతే నాలుక కోసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 


విజయవాడలో బుద్ధా వెంకన్న ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. ఆరా మస్తాన్ వైసీపీ గెలుస్తుందని ఫేక్ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశారని మండిపడ్డారు. వైసీపీ చెప్పినట్లు ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇచ్చారని ఆరోపించారు. ఒకవేళ ఏపీలో కూటమి అధికారంలోకి రాకపోతే తాను నాలుక కోసుకుంటా అన్నారు. ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఆరా మస్తాన్ నాలుక కోసుకుంటాడా అని బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. ఎలాగూ ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసిన వైసీపీ నేతలు బెట్టింగ్ కాయటానికి ఫేక్ ఎగ్జిట్ పోల్స్ ప్రకటనలు ఇచ్చి ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు.


‘నేషనల్ ఛానల్స్ ఇండియా టుడే, మరిన్ని ప్రముఖ సంస్థలు కూటమి అధికారంలోకి వస్తుందని, ఎక్కువ మెజార్టీ వస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వచ్చాయి. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఆరా మస్తాన్‌తో ఫేక్ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు ప్రకటించారు. తమకు సీట్లు వస్తున్నాయని తెలిసి, ఎన్నికల కౌంటింగ్ మేనేజ్ చేసే ఉద్దేశంతో జగన్, ఆయన టీమ్ సభ్యులు, సజ్జల రామక్రిష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు కలిసి ఆరా మస్తాన్‌తో కలిసి ఫేక్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేశారు. ఎన్నికల ఖర్చులను రాబట్టుకునేందుకు బెట్టింగ్ లపై ఆధారపడి తప్పుడు సర్వే రిజల్ట్స్ ఇస్తున్నారు. ఇది నిజమని ప్రజలు బెట్టింగ్స్ కాసి నష్టపోవద్దు.


కూటమికి 130కి పైగా సీట్లు వస్తాయని దాదాపు 70 శాతం సర్వేలు చెబుతున్నాయి. మరో రెండు రోజుల్లో ఫలితాలు రానున్నాయి. కానీ ఫేక్ సర్వేల కారణంగా ప్రజలు వైసీపీ మీద బెట్టింగ్స్ వేసి మోసపోయే అవకాశం ఉంది. ఆరా మస్తాన్ ఇచ్చింది ఫేక్ సర్వే. ఫలితాల్లో కూటమి అధికారంలోకి రాకపోతే నేను నా నాలుక కోసుకుంటాను. కూటమి గెలిస్తే ఆరా మస్తాన్ నాలుక కోసుకునేందుకు సిద్ధమా. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని’ టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు.



ఏపీలో కూటమికి భారీగా సీట్లు, వైసీపీకి ఎదురుదెబ్బ!
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమికి 52.9 శాతం ఓట్లు పోల్ అవుతాయని, అధికార వైఎస్సార్ సీపీ 41.7 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 3.3 శాతం ఓట్లు వస్తాయని, ఇతరులు 2.1 శాతం ఓట్లు సాధిస్తారని (ABP CVoter Exit Poll 2024) ఎగ్జిట్ పోల్ లో తేలింది. ఏపీలో కూటమికి కనిష్టంగా 21 సీట్లు, గరిష్టంగా 25 సీట్లు వస్తాయని, వైఎస్సార్ సీపీకి 0-4 సీట్లు గెలిచే అవకాశం ఉందని సర్వేలో వచ్చింది. 2019లో వైసీపీ 22 ఎంపీ సీట్లు సాధించగా, టీడీపీ 3 ఎంపీ సీట్లకే పరిమితమైంది.