Postal Ballot News: పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఏపీ హైకోర్టు(AP High Court) శనివారం సాయంత్రం కీలక తీర్పు వెలువరించనుంది. ఓటర్ డిక్లరేషన్‌కు సంబంధించిన వైసీపీ (YSRCP)నేత లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన అత్యవసర వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు...నేడు తీర్పు వెలువరించనుంది.
హైకోర్టులో వాదోపవాదనలు
పోస్టల్ బ్యాలట్ (Postal Ballot)ఓట్ల లెక్కింపు చేసేప్పుడు ఓటర్ డిక్లరేషన్‌కు సంబంధించిన ఫాం-13Aపై అటెస్టింగ్ అధికారి పేరు, హోదా, సీలు లేకపోయినా పర్వాలేదని...ఆ అధికారి సంతకం ఉంటే చాలని మే 30న తాము ఇచ్చిన ఉత్తర్వులు నిబంధనల మేరకే ఉన్నాయని ఎన్నికల సంఘం(CEC) తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అలా అధికారి సంతకం ఉన్న పోస్టల్ బ్యాలట్లు పరిగణలోకి తీసుకోవాలని ఈసీ సూచించింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున వాదనలు సైతం పూర్తవ్వడంతో శనివారం సాయంత్రం తీర్పు వెలువడనుంది.
లేళ్ల అప్పిరెడ్డి వాదనలు
వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డి(Lella Appireddy) తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేఖ్‌మను సింఘ్వీ వాదనలు వినిపించారు. మే 30న ఈసీ ఇచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధంగా ఉన్నాయని...నిబంధనలు మార్చే అధికారం ఈసీకి లేదన్నారు. ఈసీ(EC) ఉత్తర్వులు చూస్తుంటే చెల్లని ఓట్లను పరిగణలోకి తీసుకోవాలన్నట్లు ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే ఈ విధమైన సర్క్యూలర్ ఇవ్వడం ఆంతర్యమేంటని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఈసీ ప్రవర్తిస్తున్నందున...న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ ఉత్తర్వులు నిలుపుదల చేయడంతోపాటు వాటిని కొట్టేయాలని కోరారు..
ఈసీ తరపు వాదనలు
ఈసీ తరఫున అవినాష్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఎన్నికల విధుల కారణంగా ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద పోస్టల్ బ్యాలట్(Postal Ballot) ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులకు మాత్రమే ఈసీ ఇచ్చిన ఉత్తర్వులు వర్తిస్తాయని న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ కేంద్రాల వద్ద అటెస్టింగ్ అధికారిని ఆర్వో(R.O)నే నియమించారని....కాబట్టి ఫాం 13Aపై అటెస్టింగ్ అధికారం సంతకం ఉంటే చాలని... ఆ అధికారి పేరు, హోదా, సీలు ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇతర పోస్టల్ బ్యాలటె ఓట్ల విషయంలో గ్రూప్-A, గ్రూప్-B అధికారులు అటెస్టేషన్ చేస్తారని...కానీ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లకు సంబంధించిన ఫాం-13A పై ఆర్వో నియమించిన అధికారే అటెస్టేషన్ చేశారని వివరించారు. ఓట్ల లెక్కింపు సమయంలో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. ఎన్నికలపై అభ్యంతాలు ఉంటే ప్రక్రియ ముగిసిన తర్వాత పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు.
ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తులు....శనివారం సాయంత్రం ఆరు గంటల తర్వాత తీర్పు వెలువరించనున్నట్లు తెలిపారు. సీపీసీ రద్దు సహా గత ఎన్నికల సమయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జగన్ ఇచ్చిన హామీలేవీ నెరవేర్చకపోగా....ఉద్యోగుల ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించారు. దీంతో వాళ్లంతా వైకాపాకు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. దాదాపు ఐదున్నర లక్షలకు పైగా ఉన్న పోస్టల్ బ్యాలట్ ఓట్లలో మెజార్టీ వైసీపీకి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ పోస్టల్ బ్యాలట్ ఓట్లపై వైసీపీ తొలి నుంచీ లొల్లి పెట్టుకుంటోంది.