Rahul Gandhi Dig At Exit Poll 2024: ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలన్నీ NDA హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని తేల్చి చెప్పాయి. దాదాపు 400 సీట్ల లక్ష్యాన్ని చేరుకుంటుందని అంచనా వేశాయి. అటు I.N.D.I.A కూటమికి గరిష్ఠంగా 167 సీట్లు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీని మీడియా ప్రశ్నించింది. ఈ ఎగ్జిట్‌ పోల్ ఫలితాలపై మీ అభిప్రాయమేంటని అడిగింది. అందుకు రాహుల్ ఆసక్తికర సమాధానమిచ్చారు. సిద్దూ మూసేవాలా పాట "295" ని కోట్ చేస్తూ బదులిచ్చారు. "మీరు సిద్దు మూసేవాలా 295 పాట వినలేదా" అని అడిగారు. పరోక్షంగా కూటమికి 295 సీట్లు వస్తాయని ఇలా చెప్పారు. ఇక ఎగ్జిట్ పోల్‌ ఫలితాలపైనా సెటైర్లు వేశారు. అది ఎగ్జిట్ పోల్ కాదని, మోదీ మీడియా పోల్ అని చురకలు అంటించారు. అవన్నీ ఊహాజనితమైన లెక్కలే అని తేల్చి చెప్పారు. 






జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం జరిగిన సమయంలోనే రాహుల్‌ని మీడియా ప్రశ్నించగా ఇలా సమాధానమిచ్చారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌ ఈ భేటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్‌ అంతా బోగస్ అని కొట్టి పారేశారు. కూటమి 295 సీట్లు సాధిస్తుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. జైరాం రమేశ్ కూడా ఎగ్జిట్ పోల్ అంచనాలను కొట్టి పారేశారు. జూన్ 4న ఫలితాలు ఈ అంచనాలకు పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయని వెల్లడించారు. తమకు ఆ నమ్మకం ఉందని తేల్చి చెప్పారు. 


"మా పీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రులు, ఇన్‌ ఛార్జ్‌లు, అభ్యర్థులతో కీలక చర్చలు జరిపాం. వాళ్లంతా విజయంపై చాలా ధీమాగా ఉన్నారు. ఎగ్జిట్‌ పోల్ అనేది ప్రభుత్వం సృష్టించిన ఓ బోగస్ పోల్. మా కూటమి కచ్చితంగా 295 సీట్లు సాధిస్తుందన్న నమ్మకం మాకుంది"


- కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ సీనియర్ నేత






Also Read: Election Results 2024: ఎన్నికల ఫలితాల్లో బోణీ కొట్టిన బీజేపీ,అరుణాచల్ ప్రదేశ్‌లో ఘన విజయం