Southwest Monsoon: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రుతుపవనాలు దాదాపుగా అన్ని జిల్లాల్లోకి ప్రవేశించాయి. దీంతో ఇకనుంచి అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతూ అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కాస్త చల్లబడింది. కొన్నిచోట్ల వర్షాలు ఇంకా మొదలుకాకపోవడంతో ఉష్ణోగ్రతలు దిగి రావడం లేదు.
ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో శనివారం నుంచి మరో రెండు రోజులపాటు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దక్షిణ కోస్తా ఒడిశా, పరిసర ప్రాంతంలో సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్లు ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. రాగల రెండు రోజులలో ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, మరాఠ్వాడా, కర్ణాటక, తమిళనాడు, విదర్భ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాల్లోకి నైరుతి రుతుపవనాలు ముందుకు కదులుతున్నాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు గోదావరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో అక్కడాక్కడ పది నిమిషాల వర్షాలు కురుస్తాయి. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, పల్నాడు, పాడేరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. పశ్చిమ ప్రకాశం కంభం - గిద్దలూరు, నల్లమల అటవీ ప్రాంతంతో పాటుగా పల్నాడు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. గాలుల అసహజత ఉండటం వలన ఈ రోజు కూడా రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా కడప, అన్నమయ్య, నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారిజామున దాక వర్ష సూచన ఉంది. కానీ నిన్నంత విస్తారంగా వర్షాలు కురవవు. మరో వైపున రుతుపవనాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకింది కాబట్టి కోస్తాంధ్రలో కూడ వర్షాలుంటాయి. కర్ణాటక బెంగగళూరు వైపు కురుస్తున్న భారీ వర్షాలు నేరుగా మన రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లాల వైపుగా కదులుతాయి. ఈ ప్రాంతాల్లో గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. కడప, అన్నమయ్య, నంద్యాల, అనంతపురం జిల్లాల్లొ విస్తారంగా వర్షాలు కురిశాయి.
తెలంగాణలో వర్షాలు
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత ఏడాది జూన్ తొలి వారంలో వచ్చిన రుతుపవనాలు ఈ ఏడాది రెండో వారం తరువాత తెలంగాణలో ప్రవేశించాయి. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో మరికొన్ని గంటల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తాయి. వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.