‘ఆహా’ ఓటీటీలో ప్రసారమవుతున్న ‘ఇండియన్ ఐడల్ తెలుగు’ శుక్రవారంతో ముగిసింది. సంగీత దర్శకుడు తమన్, నటి-గాయని నిత్యా మీనన్, గాయకుడు కార్తిక్‌లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఈ షోకు మంచి క్రేజ్ లభించింది. దాదాపు 15 వారాలపాటు సాగిన ఈ షోలో తమ టాలెంట్‌ను నిరూపించుకొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది యువతీయువకులు ప్రయత్నించారు. చివరికి 12 మంది మాత్రమే ఎంపికయ్యారు. వారి మధ్య జరిగిన పోటీలో ఐదుగురు ఫైనల్స్‌కు చేరుకున్నారు. 


ఐదుగురు ఫైనలిస్టులు జయంత్(రామగుండం), వాగ్దేవి(నెల్లూరు), శ్రీనివాస్(కడప), వైష్ణవి(చెన్నై), ప్రణతీ(హైదరాబాద్)లు శుక్రవారం చిరంజీవి ముందు ‘మెగా’ పర్ఫెర్మెన్స్ చేశారు. ఎట్టకేలకు విజయం వాగ్దేవినే వరించింది. వాగ్దేవి పాటకు చిరంజీవి ఫిదా అయ్యారు. వాగ్దేవి పాడిన ‘‘ఆట కావాలా పాట కావాలా’’ అనే పాట విని మెగాస్టార్ మెస్మరైజ్ అయ్యారు. ‘‘త్వరలోనే నువ్వు పాడే పాట నేను హీరోయిన్‌తో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం వస్తుంది’’ అని చిరంజీవి వెల్లడించారు.


నెల్లూరుకు చెందిన బీవీకే వాగ్దేవి చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమాలోని ‘‘లాహే లాహే..’’ పాట పాడే ఇండియన్ ఐడల్‌కు సెలక్ట్ కావడం గమనార్హం. ఫినాలేకు ముందు జరిగిన ఎపిసోడ్‌లో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఆయన పుట్టిన రోజు వేడుకను కూడా వేదికపై ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీదారుల ఆలపించిన పాటలు విని బాలయ్య పరవశించిపోయారు. ఆయన కూడా వాగ్దేవి పాట విని.. ప్రశంసల వర్షం కురిపించారు. న్యాయ నిర్ణేతల నుంచి ప్రత్యేక అతిథుల వరకు వాగ్దేవి మంచి మార్కులు కొట్టేసింది. ఎట్టకేలకు ఇండియన్ ఐడల్‌లో విజేతగా నిలిచి ఔరా అనిపించింది. ఫినాలే ఎపిసోడ్‌లో ‘విరాట పర్వం’ సినిమా ప్రమోషన్ కోసం హీరో రానా, నటి సాయి పల్లవి కూడా విచ్చేశారు. వారు సైతం ఇండియన్ ఐడల్ తెలుగు సింగర్స్ పాటలను కాసేపు ఎంజాయ్ చేశారు. 










Also Read: 'సాయిపల్లవి మైండ్ పాడైంది, ఏది పడితే అది మాట్లాడితే సహించం' బీజేపీ ఎమ్మెల్యే ఫైర్