నటి సాయిపల్లవి ఇటీవల 'విరాటపర్వం' సినిమా ప్రమోషన్స్ లో చేసిన కామెంట్స్ దుమారం రేపుతోంది. కశ్మీర్ లో పండిట్స్ మారణహోమం, గోరక్షణ పేరుతో చేస్తోన్న హింస ఒకటేనని ఆమె తన అభిప్రాయాన్ని చెప్పింది. ఈ విషయంలో చాలా మంది సాయిపల్లవిపై మండిపడుతున్నారు. భజరంగ్‌దల్ నేతలు హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో సాయిపల్లవిపై కేసు పెట్టారు. ఈ వివాదంపై తను తరువాత మాట్లాడతానని చెప్పింది సాయిపల్లవి. ఇదిలా ఉండగా.. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.. సాయిపల్లవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన సాయిపల్లవి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్ట్ పుస్తకాలు చదివి ఆమె మైండ్ పాడైందని.. నిజాలు మాట్లాడే దమ్ము ఆమెకి లేదని అన్నారు. కశ్మీర్ పండిట్స్ ను కలిస్తే నిజాలు తెలుస్తాయని హితవు పలికారు. ఇలా ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోమని.. ప్రజలు తిరగబడి కొడతారని హెచ్చరించారు. 


తెలంగాణాతో పాటు ఏపీలోని అన్ని పోలీస్ స్టేషన్ లో సాయిపల్లవిపై ఫిర్యాదు చేయమని సూచించారు. ఒకరిని అరెస్ట్ చేస్తే.. ఇక ఎవరూ హిందువుల జోలికి రాకుండా ఉంటారని.. కొందరు పాపులర్ కావాలని ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని.. హిందువులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లిమ్స్ పై, క్రిస్టియన్స్ పై ఇలా కామెంట్స్ చేస్తారా..? అని ప్రశ్నించారు రాజా సింగ్. 


ఇంతకీ సాయిపల్లవి ఏం మాట్లాడిందంటే..?


'విరాటపర్వం' సినిమాలో తన క్యారెక్టర్ గురించి చెబుతూ.. నక్సల్స్ గురించి మాట్లాడింది. అదే సమయంలో అవతలి వారిని బాధపెట్టకూడదని.. అందరూ మంచి మనుషుల్లా ఉండాలని చెప్పింది. ఎవరో ఎవరినో హర్ట్ చేస్తున్నారని.. మనం కూడా అలా చేయకూడదని.. బాధితుల గురించి ఆలోచించాలని చెప్పింది. 
ఈ క్రమంలో కశ్మీర్ పండిట్లను చంపిన ఉగ్రవాదులతో గోరక్షకులను పోల్చింది సాయిపల్లవి. కశ్మీర్ లో పండిట్లను చంపడం మతపరమైన హింసే అయితే.. గోరక్షణ పేరుతో జరుగుతోంది కూడా అదేనని చెప్పింది.