నందమూరి బాలకృష్ణను 'ఆహా' ఓటీటీ ప్లాట్ ఫామ్ లో 'అన్ స్టాపబుల్' షో చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా 'ఆహా'లో ఇండియన్ ఐడల్ కార్యక్రమానికి ఆయనను అతిథిగా తీసుకువచ్చారు. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్, కథానాయిక నిత్యా మీనన్, గాయకుడు కార్తీక్ ఈ రియాలిటీ  షోకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.


ఇప్పుడు ఈ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. ఇటీవల టాప్ 6 కంటెస్టెంట్లతో సెమీ ఫైనల్స్ నిర్వహించారు. ఆ సెమీ ఫైనల్ ఎపిసోడ్‌కు బాలకృష్ణ అతిథిగా వచ్చారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ ను 'ఆహా'లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో బాలయ్య తన మాటలతో అందరినీ ఎంటర్టైన్ చేశారు. ఒక్కో కంటెస్టెంట్ గురించి తెలుసుకొని వారితో మాట్లాడారు. 

 

ఈ క్రమంలో కొన్ని సెటైర్లు వేయడంతో పాటు కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఈ షోకి సంబంధించిన చిన్న వీడియోను తమన్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇందులో బాలయ్య.. తమన్ గురించి మాట్లాడుతున్నారు. 'భైరవద్వీపం' సినిమా నుంచే తమన్ తనకు తెలుసని బాలయ్య అన్నారు. ఆ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ లో చిన్న కుర్రాడు.. నిక్కర్ వేసుకొని.. బంగినపల్లి మామిడిపండులా ఉన్నాడని.. అతడే తమన్ అని చెప్పారు. అప్పుడు మొదలుపెట్టిన తమన్..  'అన్ స్టాపబుల్'లా దూసుకుపోతున్నాడని అన్నారు. బాలయ్య నటించిన 'అఖండ' సినిమాకి తమన్ ఇచ్చిన మ్యూజిక్ సినిమా సక్సెస్ లో కీలకపాత్ర పోషించింది.