31st July School News Headlines Today:
క్రీడలు
పారిస్ ఒలింపిక్స్‌లో మనూ బాకర్ చరిత్ర సృష్టించింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత మహిళగా రికార్డు నెలకొల్పింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి మనూ బాకర్ కాంస్యం గెలుచుకుంది. 1900 ఒలింపిక్స్‌లో నార్మన్ ప్రిచర్డ్ రెండు ఒలింపిక్ పతకాలు సాధించాడు. తర్వాత ఆ ఘనత మనూకే దక్కింది.
విశ్వ క్రీడల్లో వరుసగా రెండు పతకాలు సాధించిన మనూ బాకర్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. మనూ దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఒలింపిక్స్‌లో షూటర్ల ప్రదర్శన చూసి దేశం గర్విస్తోందని ప్రధాని మోదీ కొనియాడారు.
శ్రీలంకతో జరగుతున్న టీ 20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. నామమాత్రమైన మూడో టీ 20లో కూడా భారత్ విజయం సాధించింది. మ్యాచ్ డ్రా గా సాగడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. అయితే ఆఖరి ఓవర్లో కెప్టెన్ సూర్య అద్భుతం చేశాడు. బౌలింగ్లో కూడా రాణించి భారత్ ను అజేయంగా నిలిపాడు.
ఆంధ్రప్రదేశ్ వార్తలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్సును గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్టుకు కాలపరిమితి నేటితో ముగియనుండడంతో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్సు జారీ చేశారు.
ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతుండడంతో శ్రీశైలం జలాశయంలోని ఏడు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ నీరు నాగార్జునసాగర్ వైపు పరుగు తీస్తోంది. జల కళను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.
తెలంగాణ వార్తలు
రైతు రుణమాఫీ రెండో విడత నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. 6.4 లక్షల మంది రైతుల ఖాతాల్లో రెండో విడతగా రూ.6,190 కోట్లు జమ చేసింది. అంతకు ముందు మొదటి విడతలో రూ.6,035 కోట్లను 11.34 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టింది. కొడంగల్‌లో ఈ యూనివర్సిటీని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఈ వర్సిటీ ద్వారా యువతకు అధునాతన పరిజ్ఞానం అందించడమే లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది.
జాతీయ వార్తలు
కేరళలోని వయానాడ్‌లో కొండ చరియలు విరిగిపడి 150 మంది మరణించారు. వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలికి వెళ్లే రోడ్డు మార్గాలు కూడా ధ్వంసమైయ్యాయి. ఈ క్రమంలో 8 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. 5 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
అంతర్జాతీయ వార్తలు
వెనెజువెలాలో అధ్యక్షుడిగా మరోసారి నికోలస్ మడురో ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ఆయనకు 51.20 శాతం ఓట్లు రాగా.. ఆయన ప్రధాన ప్రత్యర్థి ఎడ్మండో గొంజాలెజ్‌కి 44.02 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయని ప్రతిపక్షం ఆరోపించింది. దీనిపై ఆందోళనలు జరుగుతున్నాయి.
మంచి మాట
మీ అపజయాలను తప్పటడుగులను అనుకోకండి. అవి తప్పులు కాదు. భవిష్యత్తులో మీరేం చేయకూడదో తెలిపే పాఠాలు.