india vs Sri Lanka 3rd T20I Highlights: నామమాత్రమైన మూడో టీ 20లో శ్రీలంక(Srilanka) విజయమని అంతా భావించారు. ఎందుకంటే మ్యాచ్ టై కావడానికి ముందు లంకకు ఆరు బంతుల్లో కేవలం ఆరు పరుగులు మాత్రమే కావాలి. చేతిలో ఇంకా నాలుగు వికెట్లు ఉన్నాయి. భారత్(India)కు పేసర్లు సిరాజ్, ఖలీల్ అహ్మద్‌లకు చెరో ఓవర్ ఇంకా మిగిలే ఉంది. మాములుగా అయితే వాళ్లిద్దరిలో ఎవరో ఒకరు బౌలింగ్ చేస్తారని అంతా అనుకుంటాం. ఎందుకంటే లంక కొట్టాల్సింది కేవలం ఆరు బంతుల్లో ఆరు పరుగులు. క్రీజులో చమర విక్రమసింఘే ఉన్నాడు. ఇంకేం లంక గెలుపు ఖాయమని అంతా టీవీలు కూడా ఆఫ్ చేసేశారు. కానీ అప్పుడే ఎవ్వరూ ఊహించనది జరిగింది. ఇప్పటివరకూ బ్యాట్‌తో టీమిండియాకు విజయాలు అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్... ఇప్పుడు బంతితో భారత్‌ను బరిలో నిలిపాడు. ఆరు బంతుల్లో అయిదు పరుగులే ఇచ్చిన సూర్య... మ్యాచ్ టై కావడంలో కీలకపాత్ర పోషించాడు.
సూర్య బంతితోనూ
చివరి ఓవర్... ఆరు బంతులకు ఆరు పరుగులు కావాలి. ఇంకా నాలుగు వికెట్లు చేతిలో ఉన్నాయ్ కాబట్టి ఇక లంకకు తిరుగులేదు. కానీ ఇక్కడే కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నాడు. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండడంతో తానే బౌలింగ్ చేయాలని అనుకున్నాడు. ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్‌లకు చెరో ఓవర్ మిగిలే ఉన్నా తానే బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్లో సూర్య వేసిన తొలి బంతి అనూహ్యంగా బౌన్స్ అయి కీపర్ సంజు శాంసన చేతిలో పడింది. దీంతో లంక అయిదు బంతులకు ఆరు పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ దశలో సూర్య బంతిని రివర్స్ స్వీప్ ఆడిన కుశాల్ మెండీస్...అర్ష్‌దీప్‌సింగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో సమీకరణం నాలుగు బంతుల్లో ఆరు పరుగులుగా మారింది. ఆ తర్వాతి బంతికే తీక్షణ చేతి గ్లౌవ్‌ను తాకుతూ వచ్చిన బంతిని సంజు శాంసన్ అద్భుతంగా అందుకున్నాడు. దీంతో లంకకు మూడు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సి వచ్చింది.
సూర్య కుమార్ యాదవ్ తొలి మూడు బంతుల్లో అసలు పరుగులేమీ ఇవ్వలేదు. దీంతో మూడు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన దశలో అషిత ఫెర్నాండో సింగల్ తీశాడు. దీంతో రెండు బంతుల్లో నాలుగు పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే అయిదో బంతిన లాంగాఫ్ వైపు కొట్టిన విక్రమసింఘే రెండు పరుగులు తీశాడు. అషిత ఫెర్నాండోను రనౌట్ చేసే అవకాశం ఉన్నా సూర్య చూసుకోకుండా బంతిని కీపర్ వైపు విసరడంతో బతికిపోయాడు. దీంతో చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా... ఈసారి విక్రమ సింఘే లాంగాన్ దిశగా ఆడి రెండు పరుగులు తీశాడు. దీంతో మ్యాచ్ టై అయింది. సూర్యకుమార్ యాదవ్ చివరి ఓవర్‌ను అద్భుతంగా వేశాడు. ఒత్తిడిని తట్టుకుంటూ కేవలం అయిదే పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూడా తీశాడు. సూర్యకుమార్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇదే తొలి ఓవర్ కావడం విశేషం.