India win thrilling encounter in Super Over, seal series 3-0:  భారత్‌(India)తో జరుగుతున్న మూడో టీ 20 ఉత్కంఠభరితంగా సాగింది. సూపర్‌ ఓవర్‌(Super OVer)కు దారితీసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. సూర్యకుమార్‌ యాదవ్‌(Surya Kumar Yadav) అద్భుత బౌలింగ్‌తో తొలుత మ్యాచ్‌ టైగా ముగిసింది. అనంతరం సూపర్‌ ఓవర్‌లో శ్రీలంక(Srilanka) కేవలం రెండే పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో మూడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు... తొలి బంతికే ఫోర్‌ బాది లక్ష్యాన్ని అందుకుంది. సూర్యకుమార్‌ యాదవ్‌ ఫస్ట్‌ బాల్‌కే ఫోర్‌ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో టీమిండియా 3-0తో టీ 20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది.


 





భారత్‌ స్వల్ప స్కోరే

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక... భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్‌ 10 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. జట్టు స్కోరు 11 పరుగుల వద్ద భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 9 బంతుల్లో రెండు ఫోర్లతో పది పరుగులు చేసి యశస్వీ జైస్వాల్‌ అవుటయ్యాడు. ఆ తర్వాత సంజు శాంసన్‌ ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత రింకూసింగ్‌ కేవలం ఒకే పరుగు చేసి అవుటయ్యాడు. దీంతో టీమిండియా కేవలం 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా తొమ్మిది  బంతుల్లో ఎనిమిది పరుగులే చేసి అవుటయ్యాడు. శివమ్‌ దూబే 14 బంతుల్లో 13 పరుగులే చేయడంతో 48 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. టాపార్డర్‌లో ఏ బ్యాటర్‌ కూడా క్రీజులో నిలబడలేకపోవడంతో టీమిండియా స్కోరు బోర్డు వేగం తగ్గింది. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు శుభ్‌మన్‌గిల్‌ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. రియాన్‌ పరాగ్‌తో కలిసి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. గిల్‌ 37 బంతుల్లో 39 పరుగులు చేసి హసరంగ బౌలింగ్‌లో అవుటయ్యాడు. రియాన్‌ పరాగ్‌ 18 బంతుల్లో 26 పరుగులు చేసి హసరంగ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు.  వాషింగ్టన్ సుందర్‌ 25 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. గిల్(39), రియాన్ పరాగ్(26), వాషింగ్టన్ సుందర్(25), జైస్వాల్ (10), శాంసన్(0), రింకూసింగ్(1), సూర్య కుమార్(8), దూబే(13) రన్స్ మాత్రమే చేయగలిగారు. దీంతో శ్రీలంకకు 138 పరుగుల స్వల్ప లక్ష్యం నిర్దేశించారు.  

 

లంక సునాయసంగానే

139 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు మరోసారి మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు నిసంక, కుశాల్‌ మెండీస్‌ తొలి వికెట్‌కు 58 పరుగులు  జోడించి లంకను లక్ష్యం దిశగా నడిపించారు. 27 బంతుల్లో 26 పరుగులు చేసి నిసంక... రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత కుశాల్‌ మెండీస్‌తో కలిసి కుశాల్‌ పెరీరా లంకను విజయం దిశగా నడిపించాడు. కుశాల్‌ మెండీస్‌ 41 బంతుల్లో 43 పరుగులు చేసి బిష్ణోయ్‌ బౌలింగ్‌లోనే పెవిలియన్‌ చేరాడు. కుశాల్‌ పెరీరా 34 బంతుల్లో 46 పరుగులు చేసి అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో చివరి ఓవర్‌లో లంక విజయానికి ఆరు పరుగులు చేయాల్సి వచ్చింది. కానీ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి కేవలం అయిదే పరుగులు ఇవ్వడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది.

 

సూపర్‌ ఓవర్‌లో ఇలా... 

సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక కేవలం రెండే పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్‌ రెండు బంతుల్లో రెండు వికెట్లు తీయడంతో లంక ఇన్నింగ్స్‌ ముగిసింది. సుందర్‌ మూడో బంతికి పెరీరాను... నాలుగో బంతికి నిసంకను అవుట్ చేశాడు. దీంతో రెండు పరుగులకే లంక సూపర్‌ ఓవర్‌ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ముగిసింది. మూడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు... తొలి బంతికే ఫోర్‌ బాది సూర్యకుమార్‌ యాదవ్‌ విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో టీమిండియా 3-0తో టీ 20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది.