BRS And BSP: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు పొత్తులకు రెడీ అవుతున్నాయి. ఏపీ నుంచి టీడీపీ, ఒడిశా నుంచి బీజేడీ ఎన్డీయేలో చేరగా.. బీఎస్పీ కూడా కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలతో పొత్తులకు సిద్దమవుతోంది. అందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్‌ (BRS)తో కలిసి పోటీ చేయాలని బీఎస్పీ నిర్ణయం తీసుకుంది. ఇటీవల మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ (BRS Chief KCR)తో భేటీ అయిన తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar).. బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయడంతో పాటు సీట్ల సర్దుబాటుపై చర్చించారు. అనంతరం రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నట్లు కేసీఆర్, ఆర్ఎస్పీ ఉమ్మడి ప్రకటన చేశారు.


ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ


అయితే బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి మాత్రం భిన్నమైన ప్రకటన చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీలతో పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు.  యూపీలో మాత్రమే పొత్తులు ఉంటాయని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తుపై కేసీఆర్, ఆర్‌ఎస్పీ ప్రకటన చేసిన కొద్ది రోజుల్లోనే యామావతి చేసిన ప్రకటనతో సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో మాయావతి చేసిన వ్యాఖ్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.  బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుకు మాయావతి అంగీకారం తెలిపారని అన్నారు. పొత్తులకు సంబంధించి త్వరలో మరోసారి కేసీఆర్‌తో చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. మాయావతి వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో.. ఆర్‌ఎస్పీ మీడియాకు ముందుకు వచ్చి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.


మాయావతి నుంచి అనుమతి వచ్చింది


బీఆర్ఎస్‌తో పొత్తుపై చర్చలు జరిపేందుకు త్వరలో బీఎస్పీ ఎంపీ, కేంద్ర సమన్వయకర్త రాంజీ మెహన్జీ దూతగా రానున్నట్లు ఆర్‌ఎస్పీ తెలిపరు. ప్రస్తుతం బీఆర్ఎస్ దేశంలోని ఏ కూటమిలో లేనందున ఆ పార్టీతో కలిసి పనిచేయడానికి మాయావతి అనుమతించినట్లు బీఎస్పీ హైకమాండ్ తనకు తెలిపిందన్నారు. మాయావతి చేసిన ట్వీట్‌ సారాంశాన్ని  అర్థం చేసుకోకుండా చాలామంది రకరకాల ఊహాగానాలు చేస్తున్నారని, గతంలో అనేకసార్లు మాయావతి  తాము ఏ జాతీయ పార్టీలతో లేదా ఎన్డీయే, ఇండియా కూటములతో పొత్తు పెట్టుకోమని స్పష్టం చెప్పారని, అప్పట్లో కూడా తృతీయ ఫ్రంట్ అని మీడియాలో వస్తున్న అసత్య కథనాల మీద వివరణ ఇచ్చారని ఆర్ఎస్పీ గుర్తు చేశారు. యూపీలో కూడా ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారని, అంతే తప్ప ఏ కూటమిలో లేని పార్టీలతో పనిచేయడం గురించి ప్రస్తావించలేదని అన్నారు. 


అసత్య ప్రచారాలను నమ్మవద్దు


బీఆర్ఎస్‌తో సీట్ల పంపకంపై త్వరలోనే చర్చలు జరుపుతామని, అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పొత్తుకు సంబంధించి అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేసింది. ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రభుత్వంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు.  కేసీఆర్‌పై దుమ్మెత్తిపోసిన ఆయన.. ఇప్పుడు బీఆర్ఎస్‌తో కలవడం తెలంగాణ రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది. ఆర్ఎస్పీ కేసీఆర్ కోవర్ట్ అని ఇప్పుడు అర్థమవుతుందని కొంతమంది ఆరోపిస్తున్నారు.