Christopher Nolan Remuneration: ప్రపంచంలో భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే దేశాల్లో భారత్ కూడా ఒకటి. బాలీవుడ్ లో సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్ ఇప్పుడిప్పుడే సినిమాలు తెరకెక్కుతున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో తెరకెక్క బోతున్న ‘SSMB29’ సినిమా సుమారు రూ. 1000 కోట్లతో రూపొందబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ ఐదారు మంది టాప్ స్టార్లు ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఒక్క సినిమాకు రూ. 100 కోట్ల పారితోషికం అందుకున్న దర్శకుడు ఎవరూ లేరు. రెమ్యునరేషన్, లాభాల్లో వాటాలు అని తీసుకున్నా, ఇంత వరకు ఆ మార్క్ ఎవరూ దాటలేదు. ఈ నేపథ్యంలో కొంత మంది దర్శకులే తమ సినిమాలను నిర్మించుకుంటూ బాగా డబ్బు సంపాదిస్తున్నారు.
ఒక్క సినిమాకు రూ. 600 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న హాలీవుడ్ డైరెక్టర్
కానీ, ఓ హాలీవుడ్ డైరెక్టర్ తాజాగా ఎవరికీ సాధ్యం కాని రీతిలో రెమ్యునరేషన్ తీసుకున్నారు. తను దర్శకత్వం వహించిన సినిమాకు ఏకంగా రూ. 600 కోట్లు రెమ్యునరేషన్ అందుకుని ప్రపంచ సినీ పరిశ్రమను ఆశ్చర్యానికి గురి చేశారు. అతడు మరెవరో కాదు దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్. తాజాగా ఆయన అణుబాంబు పితామహుడు రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవిత కథ ఆధారంగా ‘ఓపెన్ హైమర్’ అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 8274 కోట్లు వసూళు చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద మొత్తంలో వసూళ్లు సాధించిన చిత్రం మరొకటి లేదని చెప్పుకోవచ్చు.
రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటా తీసుకున్న నోలన్
నిజానికి నోలన్ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు అందుకుంటున్నాయి. వాటి మాదిరిగానే గత ఏడాది ఆయన తెరకెక్కించిన ‘ఓపెన్ హైమర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు గాను ఆయన సుమారు 72 మిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 600 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. వాస్తవానికి చాలా మంది దర్శకుడు రెమ్యునరేషన్ తో పాటు వచ్చే లాభాల్లో వాటాలు తీసుకుంటారు. కానీ, ముందు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు. కలెక్షన్లలో వాటాను తీసుకుంటానని చెప్పారు. ఆయన కండీషన్ కు నిర్మాణ సంస్థ కూడా ఓకే చెప్పింది. ముందస్తు ఒప్పంద ప్రకారం ఆయన రూ. 8274 కోట్ల వసూళ్లలో తన వాటాగా రూ. 600 కోట్లు తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు.
13 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లు
2023లో విడుదలైన ‘ఓపెన్ హైమర్’ సినిమా ‘బార్బీ’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడింది. అయితే, ‘బార్బీ’ సినిమా నోలన్ మూవీ ముందు నిలబడలేకపోయింది. అంతేకాదు, తాజా ఆస్కార్ నామినేషన్లలోనూ ‘ఓపెన్ హైమర్’ సినిమా దుమ్మురేపింది. ఏకంగా 13 విభాగాల్లో నామినేషన్లు అందుకుంది. ఈ సినిమాలో సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్ర పోషించారు. రాబర్ట్ డౌనీ జూనియర్, ఎమిలీ బ్లంట్, ఫ్లోరెన్స్ పగ్, మాట్ డామన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
Read Also: ‘స్పైడర్ మ్యాన్ 4’ రాబోతుందా? దర్శకుడు సామ్ రైమి కీలక వ్యాఖ్యలు!