Delhi CM Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వింత వ్యాఖ్యలు చేశారు. "మీ భర్త మోదీ పేరు జపిస్తే అన్నం పెట్టడం మానేయండి" అని మహిళలకు సూచించారు. ఢిల్లీలో జరిగిన Mahila Samman Samaroh కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు కేజ్రీవాల్. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 


"చాలా మంది మగవాళ్లు పదేపదే ప్రధాని మోదీ పేరునే జపిస్తారు. ఈ బాధ మీకు తప్పాలంటే ఒక్కటే మార్గం ఉంది. మీ భర్త ఎప్పుడు మోదీ పేరు జపించినా ఆ రోజు తిండి పెట్టడం మానేయండి"


- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి


2024-25 బడ్జెట్‌లో భాగంగా కేజ్రీవాల్ సర్కార్ ఓ కీలక పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. 18 ఏళ్లుపైబడిన మహిళలందరికీ నెలనెలా రూ.1000 ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తామని వెల్లడించింది. మహిళా సమ్మాన్ సమారోహ్‌ కార్యక్రమంలో భాగంగానే మహిళల్ని ఉద్దేశించి మాట్లాడారు కేజ్రీవాల్. వచ్చే ఎన్నికల్లో ఇంట్లో వాళ్లంతా ఆమ్‌ఆద్మీ పార్టీకే ఓటు వేసేలా తమపై ఒట్టు వేయించుకోవాలని మహిళలకు పిలుపునిచ్చారు. బీజేపీకి మద్దతునిచ్చే మహిళలతోనూ మాట్లాడాలని, కేజ్రీవాల్ మాత్రం తమకు అండగా నిలబడగలడన్న నమ్మకం ఇవ్వాలని సూచించారు. 


"బీజేపీకి మద్దతునిచ్చే మహిళలతో మాట్లాడండి. నేను అందరికీ ఉచిత విద్యుత్ ఇస్తున్నాను. బస్‌లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు నెలనెలా రూ.1000 ఆర్థిక సాయమూ అందిస్తున్నాం. మరి బీజేపీ ఏం చేసింది..? బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి..? ఈ సారి నాకు ఓటు వేయండి. మీ ఇంట్లో వాళ్లంతా మా పార్టీకే ఓటు వేసేలా ఒట్టు వేయించుకోండి"


- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి


మహిళా సాధికారత పేరు చెప్పి బీజేపీ అందరినీ మోసం చేస్తోందని విమర్శించారు కేజ్రీవాల్. కొంత మహిళలకు పదవులు కట్టబెట్టి ఇదే మహిళా సాధికారత అని ప్రచారం చేసుకుంటన్నారని, వాళ్లకి కావాల్సింది అది మాత్రమే కాదని అన్నారు. ఎవరో ఒకరిద్దరికి పదవులు ఇచ్చి ఊరుకుంటే మిగతా వాళ్ల సంగతేంటని ప్రశ్నించారు. తాము తీసుకొచ్చిన ముఖ్యమంత్ర మహిళా సమ్మాన్ యోజన పథకంతో మహిళలందరికీ ప్రాధాన్యత దక్కుతుందని వివరించారు. 


అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నందుకు తనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చినా తప్పులేదని అన్నారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని బీజేపీ అడ్డుకోవాలని కుట్ర చేస్తోందని మండి పడ్డారు. హాస్పిటళ్లు, స్కూల్స్‌ కడుతుంటే ఆ నిర్మాణాలనూ ఆపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు సరైన విద్య అందించడం బీజేపీకి ఇష్టం లేదంటూ ఫైర్ అయ్యారు. ఇన్ని సవాళ్లు మధ్య ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తున్నానో తనకు మాత్రమే తెలుసని అన్నారు. 


"మా ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాల్ని అడ్డుకోవడమే బీజేపీ. మేం స్కూళ్లు, హాస్పిటల్స్‌ కట్టాలనుకున్నా వాటినీ అడ్డుకుంటోంది. వాళ్ల పిల్లల్ని గొప్ప గొప్ప చదువులు చదివిస్తారు. అదే మేం పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తామంటే మాత్రం ఆటంకాలు సృష్టిస్తారు. ఇన్ని సమస్యల మధ్య ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నానో నాకు మాత్రమే తెలుసు. ఈ సవాలుని అధిగమిస్తున్నందుకు నాకు నోబెల్ ప్రైజ్ ఇచ్చినా తప్పులేదు"


- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి