తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఏ మాత్రం సర్దుకోలేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. మొన్నటికి మొన్న వైఎస్ఆర్ ఆత్మీయ సమావేశానికి వెళ్లిన కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయగా పార్టీ విధానానికి వ్యతిరేకంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మరోసారి దళిత బంధుపై ప్రగతి భవన్‌తో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి భట్టి విక్రమార్క హాజరయ్యే ముందే టీ పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో పలువురు రేవంత్ వ్యతిరేక వర్గీయులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల గోల ఏ మాత్రం సద్దుమణగలేదన్న అభిప్రాయం ఊపందుకుంటోంది. Also Read : తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడంను మించి విద్యుత్ బకాయిల గొడవ !
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను దళిత బంధు మీటింగ్‌కు మరోసారి సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. ఆయన నియోజకవర్గంలోని ఓ మండలంలో దళిత బంధు పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించడంతో ఆయన హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇలా నిర్ణయించుకునే ముందు రేవంత్ వ్యతిరేక వర్గం అంతా భేటీ అయింది. ఈ పరిణామంతో కాంగ్రెస్‌లో గందరగోళం ఏర్పడింది. దళిత బంధును పచ్చి మోసంగా చెబుతూ దళిత, గిరిజన దండోరాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఆ పథకం పేరుతో నిర్వహిస్తున్న సమావేశాలకు హాజరు కావడం ఏమిటన్న అనుమానం ఆ పార్టీ కార్యకర్తల్లో ప్రారంభమయింది. భారతీయ జనతా పార్టీ కూడా ఈ అంశంపై స్పష్టమైన అభిప్రాయంతో ఉంది. కేసీఆర్ దళితుల్ని మోసం చేసేందుకు రాజకీయ లబ్ది కోసమే దళిత బంధు పేరుతో హడావుడి చేస్తున్నారని అంటోంది. ఆ వాదానికి కట్టుబడి ఎలాంటి సమావేశాలకు హాజరు కావడం లేదు. అయితే సోమవారం నాటి సమావేశానికి బీజేపీ నేతలకు ఆహ్వానం వెళ్లలేదు. పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలనుకున్న నాలుగు మండలాల పరిధిలో బీజేపీ ప్రజాప్రతినిధులు లేరు.Also Read : టాలీవుడ్ బృందంతో జగన్ భేటీ అప్పుడే !?
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్‌లో కదలిక వచ్చిందని పోరాటం ప్రారంభించిందన్న అభిప్రాయంతో క్యాడర్ ఉంది. అయితే రేవంత్ నాయకత్వాన్ని ఇష్టపడని సీనియర్ నేతలు కలసి నడిచేందుకు సిద్ధపడలేదు. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకూ నిర్వహించిన దళిత, గిరిజన దండోరాలకు సీనియర్ నేతలు పెద్దగా సహకరించలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో దండోరా నిర్వహించడానికి అంగీకరించలేదు. అదే సమయంలో ఇతర సీనియర్ నేతలందరూ దళిత బంధు విషయంలో ఎలాంటి విమర్శలు చేయడం లేదు. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీప బంధువు అయిన పాడి కౌశిక్ రెడ్డి కోవర్టుగా వ్యవహరించి చివరికి పార్టీ నుంచి వెళ్లిపోయారు. అప్పుడు కూడా ఉత్తమ్ చూసీ చూడనట్లుగానే ఉన్నారు. Also Read : పార్టీ పటిష్టతకు రేవంత్ మెగా ప్లాన్ ?
కాంగ్రెస్ హైకమాండ్ రెండు రోజుల కిందట సీనియర్ నేతలందరితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని నియమించింది. మాణికం ఠాగూర్ ఛైర్మన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కన్వీనర్‌గా 20 మంది సభ్యులతో కమిటీని ప్రకటించారు. ఈ కమిటీ నిర్ణయం ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేకుండానే భట్టి విక్రమార్క సీఎం సమావేశానికి వెళ్లిపోయారు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌కు వ్యతిరేకంగా ఓ బలమైన కూటమి కట్టేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని సులువుగానే అర్థం అవుతోంది. పార్టీ నేతలంతా ఏకతాటిపైకి నడిస్తేనే పార్టీకి పూర్వ వైభవం కష్టమన్న అంచనాలు ఉన్నాయి. అలాంటిది పాత తరహాలో గ్రూపులు కట్టి కాంగ్రెస్ పైనే కాంగ్రెస్ నేతలు పోరాటం చేస్తే ఇక కాంగ్రెస్ రేసులోకి రావడం కల్ల అన్న చర్చ జరుగుతోంది. Also Read : సెప్టెంబర్ 17న గజ్వేల్ గడ్డపై గర్జన