కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ మరో మైలురాయిని అందుకుంది. నిన్న (సెప్టెంబర్ 13) సాయంత్రం వరకు ఏపీలో మొత్తం 3.51 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు కోటి మందికి పైగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ఫ్రంట్ లైన్ వారియర్స్, హెల్త్ కేర్ వర్కర్లు 45 సంవత్సరాలకు పైబడిన వారికి 100 శాతం కోవిడ్ వ్యాక్సిన్‌ పూర్తయినట్లు తెలిపింది. గత మూడు రోజులుగా (సెప్టెంబర్ 11 నుంచి 13) రాష్ట్రంలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి వ్యాక్సిన్లు అందించారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 15,46,519 మందికి టీకాలు అందించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఒకే రోజులో ఇంత భారీ సంఖ్యలో టీకాలు అందించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి కావడం విశేషం.

  


కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా మూడు రోజుల్లో 28.63 లక్షల మందికి వ్యాక్సిన్లు వేసినట్లు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ వెల్లడించారు. రాష్ట్రంలో అర్హులందరికీ టీకా అందించే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోందని చెప్పారు. వ్యాక్సిన్లు ఇవ్వడంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో పాటు ఆరోగ్య శాఖ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. 


3.51 కోట్ల డోసులు.. 
రాష్ట్రంలో రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్న వారి సంఖ్య 1,08,49,970గా ఉందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 1,34,51,311 మందికి సింగిల్ డోసు అందించినట్లు తెలిపారు. కనీసం ఒక డోసు లేదా రెండు డోసుల టీకా తీసుకున్న వారి సంఖ్య 2,43,01,281గా ఉందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ లభ్యతను బట్టి రాష్ట్రంలో టీకా ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. కాగా.. ప్రస్తుతం 18 ఏళ్లు దాటిన వారితో పాటు రెండో డోసు ఇవ్వాల్సిన వారికి టీకా పంపిణీ కార్యక్రమం వేగవంతంగా జరుగుతోంది. 5 ఏళ్ల లోపు చిన్నారులున్న తల్లులకు మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తయింది.





నిన్న ఒక్కరోజే 15,46,519 మందికి టీకాలు..





Also Read: EAPCET Results 2021: నేడు ఈఏపీసెట్ అగ్రి, ఫార్మసీ విభాగాల ఫలితాలు.. రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే​


Also Read: Raitukosam Telugu desam: రైతు కోసం తెలుగుదేశం పేరిట టీడీపీ ఆందోళనలు... నేటి నుంచి ఐదు రోజుల పాటు నిరసనలు... రైతుల సమస్యలపై పోరాడనున్నట్లు ప్రకటన