Revanth Reddy On KCR: తెలంగాణలో సర్పంచ్‌లో దీన పరిస్థితిని ఎదుర్కొంటున్నారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. దానికి సంబంధించి పత్రికలో వచ్చిన ఓ కథనాన్ని ట్వీట్ చేశారు. గ్రామంలో చేసిన పనులకు గత రెండేళ్లుగా ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిన కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం ఎరుగండ్ల పల్లి సర్పంచ్ మాడెం శాంతమ్మ తన గ్రామంలో జరిగిన పనులకు సంబంధించి రెండేళ్ల నుంచి బిల్లులు రావడం లేదని ఆవేదన చెందారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో తన పుస్తెల తాడు అమ్మేసి రుణాలకు వడ్డీలు కట్టానని వాపోయారు. మర్రిగూడ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన పల్లో ప్రగతి కార్యక్రమంలో సర్పంచ్ శాంతమ్మ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారంటూ నిలదీశారు. గత రెండేళ్ల కాలంలో తాము గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల పనులు చేయించామని, ఇప్పటికీ ఆ బిల్లులు రాలేదని అన్నారు. అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదని చెప్పారు. 


రూ.25 లక్షలతో గ్రామంలో పనులు చేయించగా, ఇందులో రూ.20 లక్షలు ప్రైవేటు వ్యక్తుల నుంచి వడ్డీకి తెచ్చానని అన్నారు. ప్రభుత్వం నుంచి కేవలం రూ.5 లక్షల బిల్లులు మాత్రమే చెల్లించారని చెప్పారు. తెచ్చిన అప్పు తీర్చలేక, తాను పుస్తెలతాడు అమ్మి వడ్డీలు కట్టానని అన్నారు.


Also Read: Sircilla: తాగిన మైకంలో కొట్టుకున్న ప్రాణస్నేహితులు, తెగిన నాలుక - అందుకు ప్రభుత్వమూ కారణమే!


ఈ కథనాన్ని రేవంత్ రెడ్డి ట్విటర్‌లో షేర్ చేశారు. ‘‘ఆడబిడ్డకు పుస్తెల తాడు ప్రాణ సమానం. ఊరికి ఉపకారం చేసినందుకు ఆ తాళినే అమ్మి వడ్డీలు కట్టాల్సిన దుస్థితి కల్పించిన దౌర్భాగ్యుడు కేసీఆర్. టీఆర్ఎస్ పాలనలో పల్లెల దుర్గతికి నిదర్శనం ఎరుగండ్ల పల్లి సర్పంచ్ మాడం శాంతమ్మ దీనగాథ!’’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.


Also Read: Khammam: పది రోజుల్లో పెళ్లి, అయినా యువకుడి వివాహేతర సంబంధం! చివరికి హత్య