Khammam Crime News: వివాహేతర సంబంధం ఓ యువకుడిని బలిగొంది. పది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ యువకుడు మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. చివరికి అదే అతని ప్రాణాలను బలిగొంది. భార్య ఆ యువకుడితో అక్రమ సంబంధం ఏర్పర్చుకోవడంతో జీర్ణించుకోలేని భర్త ఆ ఇద్దరిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనలో యువకుడు మృతి చెందాడు. వివాహేతర సంబందం నేపథ్యంలో యువకుడిని హత్య చేసిన సంఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఖమ్మం అల్లీపురం గ్రామానికి చెందిన సంపంగి వీరబాబు, వైరా మండలానికి చెందిన మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి బాబు, పాప ఉన్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో మహిళ ఖమ్మం నగరంలోని గోపాలపురం సమీపంలో ఓ ఇల్లు అద్దె తీసుకుని నివసిస్తుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్‌పై పనిచేస్తున్న అల్లిపురానికి చెందిన నల్లగట్ట నవీన్‌తో వివాహేతర సంబందం ఏర్పడింది. ఈ విషయం భర్త వీరబాబుకు తెలియడంతో నవీన్, వీరబాబుల మద్య గొడవలు జరిగాయి. ఈ విషయంపై ఇరువురు పోలీస్ స్టేషన్‌లో గతంలో కేసులు సైతం పెట్టుకున్నారు. గొడవలు జరిగినప్పటికీ నవీన్ అక్రమ సంబందం కొనసాగిస్తుండటంతో వీరబాబు తట్టుకోలేకపోయాడు.
మరో పదిరోజుల్లో పెళ్లి..
అయితే, ఇటీవల నవీన్‌కు మరో యువతితో నిశ్చితార్థం జరిగింది. మే 9న పెళ్లి చేసేందుకు ముహుర్తాలు పెట్టుకున్నారు. కాగా సదరు మహిళ ఇంటికి నవీన్ రాత్రి వెళ్లాడు. వీరిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న వీరబాబు అక్కడికి వెళ్లాడు. నవీన్‌పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళకు సైతం గాయాలయ్యాయి. ఈ సంఘటనలో నవీన్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆటోలో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించడంతో అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నవీన్ మృతి చెందాడు. కాగా పెళ్లి కార్డు ఇచ్చేందుకు తన కుమారుడు మహిళ ఇంటికి వెళ్లగా వీరబాబు దాడి చేసి హత్యకు పాల్పడ్డాడని నవీన్ తండ్రి శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.