Kurnool Mayor BY Ramaiah: కర్నూలు మేయర్ బీవై రామయ్య మీడియా ప్రతినిధులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. పని గట్టుకొని తప్పుగా ప్రచారం చేస్తే పత్రికా విలేకరుల వీపులు వాయగొడతాం అంటూ ఆయన హెచ్చరించారు. దీనిపై స్థానికంగా ఉన్న మీడియా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కర్నూలులోని వైఎస్ఆర్ సీపీ పార్టీ కార్యాలయంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో మాట్లాడారు.
కర్నూలులో నిర్వహించిన వైఎస్ఆర్ సీపీ సభకు జనం రాలేదనేది అవాస్తవమని కర్నూలు మేయర్ అన్నారు. అధికారంలో ఉండేది తమ ప్రభుత్వమేనని తప్పుడు వార్తలు రాస్తే మీ ఒళ్ళు వాయగొడతాం జాగ్రత్త.. అంటూ మీడియా ప్రతినిధులను బెదిరించారు. మేయర్ బెదిరింపులపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. మేయర్ తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. లేదంటే తాము పోరాటం చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
అయితే, ఆ రోజు జరిగిన వైఎస్ఆర్ సీపీ సభకు జనం వచ్చారని, అక్కడ ఎండగా ఉండడంతో జనమంతా పక్కనే నీడలో నిలబడ్డారని మేయర్ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ, మీడియా ప్రతినిధులపై ఇష్టమొచ్చినట్లుగా మేయర్ మాట్లాడడంపై జర్నలిస్టులు ఆగ్రహంతో ఉన్నారు.
ఖాళీగా కనిపించిన కుర్చీలు
కర్నూలులోని ఆదివారం నిర్వహించిన సభకు ప్రజలు హాజరుకాకపోవడంతో మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకే డ్వాక్రా మహిళలను సభకు తరలించారు. అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఎండ తీవ్రత తట్టుకోలేక మహిళలు వెళ్లిపోయారు. మంత్రులు దాదాపు ఒంటిగంటకు కర్నూలు చేరుకున్నారు. అప్పటికే జనాలు వెళ్లిపోవడంతో సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. వెళ్లిపోతున్న వారిని కర్నూలు మేయర్ బీవై రామయ్య, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ కూర్చీల్లో కుర్చోవాలని కోరినా పట్టించుకోలేదు. దీంతో మంత్రులు సభను కొద్ది సేపు నిర్వహించి వెళ్లిపోయారు.
అనంతపురంలో భారీ స్పందన
అనంతరం బస్సు యాత్ర అనంతపురం చేరుకుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీ స్పందన లభించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మంత్రులు ఈ సభలో పాల్గొన్నారు. ఈ సభలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. టీడీపీ పాలనలో సంక్షేమ పథకాలన్నీ ఆ పార్టీ కార్యకర్తలకే అందాయన్నారు. వైఎస్ జగన్ పాలనలో కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారన్నారు. టీడీపీ మహానాడు అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు.