ఎప్పుడూ సమస్యలు వినిపించే, కనిపించే ఉస్మానియా ఆస్పత్రిలో మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి మార్చురీలో సిబ్బంది దౌర్జన్యం ప్రదర్శించారు. ఓ శవం విషయంలో మార్చురీ సిబ్బంది లంచం డిమాండ్‌ చేశారు. ప్రశ్నించినందుకు బాధిత కుటుంబ సభ్యులపై జులుం కూడా ప్రదర్శించారు.  దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ కూడా అవుతోంది.


అసలేం జరిగిందంటే.. హైదరాబాద్‌లోని చాదర్‌ ఘాట్‌ ప్రాంతానికి చెందిన మజీద్‌ అనే ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండడం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మజీద్‌ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే, రూ.వెయ్యి ఇస్తేనే మృతదేహాన్ని తీసుకుంటామని మార్చురీ సిబ్బంది చెప్పారు. దీంతో డబ్బులు ఎందుకు ఇవ్వాలని బాధితులు గొడవకు దిగారు. 


సిబ్బంది ఏకంగా రూ.వెయ్యి రూపాయలు డిమాండ్‌ చేస్తూ మృతుడి బంధువులతో గొడవకు దిగారు. డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ వారిపై అధికారం చెలాయించాడు. దీంతో తాగిన మత్తులో మార్చురీ సిబ్బంది బీభత్సం సృష్టించారు. మార్చురీ సిబ్బంది తీరుతో కోపోద్రిక్తులై స్థానికులు ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు.


ఇటీవలే 15 మందికి అరుదైన ఆపరేషన్లు
దీర్ఘకాలికంగా కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్న రోగులకు అరుదైన ల్యాప్రోస్కోపిక్ నెఫ్రక్టమీ ఆపరేషన్లను కొద్ది రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రిలో చేశారు. ఆ విషయాన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగేంద్ర అప్పుడు ప్రకటించారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో రూ.15 లక్షల వరకు ఖర్చు అయ్యే ఈ ఆపరేషన్ ను ఇప్పటివరకు ఆరోగ్య శ్రీ కింద 11 మందికి ఉచితంగా చేశామని వెల్లడించారు. ల్యాప్రోస్కోపిక్ ట్రీట్మెంట్లో కోత చిన్నదిగా ఉంటుందని, ఇన్ఫెక్షన్ రేట్ తక్కువగా ఉంటుందని, తద్వారా త్వరగా కోలుకుంటారని తెలిపారు.


ఉస్మానియా హాస్పిటల్‌లో ట్విన్‌ టవర్స్‌ నిర్మాణంపై మరో ముందడుగు వేసింది ప్రభుత్వం. త్వరగా రిపోర్ట్‌ ఇవ్వాలని చీఫ్‌ ఇంజనీర్ల కమిటీని ఆదేశించింది. ఉస్మానియా హాస్పిటల్‌పై త్వరగా రిపోర్ట్‌ ఇవ్వాలని చీఫ్‌ ఇంజనీర్ల కమిటీని కోరింది కేబినెట్‌ సబ్‌ కమిటీ. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్ అలీ సమావేశమై ఇటీవలే చర్చించారు. ప్రస్తుతమున్న బిల్డింగ్స్‌ను టచ్‌ చేయకుండా అసలు కొత్త నిర్మాణాలు చేపట్టగలమో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు.


రెండేళ్ల క్రితం హైదరాబాద్ ను వరదలు ముంచెత్తినప్పుడు ఉస్మానియా ఆస్పత్రిలోకి విపరీతమైన నీరు వచ్చిన సంగతి తెలిసిందే.