Rangareddy Family Commits suicide: కొందరు చిన్న విషయాలు, తప్పిదాలకు ప్రాణాలు తీసుకుంటున్నారు. మరికొందరు అప్పుల బాధ భరించలేక, జీవితంలో అనుకున్నది సాధించలేదనో, వేరే కారణాలతో మనోవేదనతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఆ వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని మలక్‌పేట్‌లో నివాసం ఉంటున్న ఓ ముస్లిం దంపతులకు సంతానం ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ కుటుంబం గత కొంతకాలం నుంచి అప్పుల బాధతో ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ఆ కుటుంబం మొదట పురుగుల మందు తాగారు. ఆ తరువాత చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తెల్లవారేసరికి తండ్రి, ఇద్దరు కుమార్తెల మృతదేహాలు చెరువులో తేలాయి. మహిళ మృతదేహం కోసం రెస్క్యూ టీమ్ గాలిస్తోంది. ఈ ఘటన ఆదిభట్ల పరిధిలోని కూర్మల్గూడలో జరిగింది. మృతులను కుద్దూస్, ఫిర్దోస్, మెహక్ బేగంలుగా పోలీసులు గుర్తించారు. మరో పాప ఉన్నట్లుగా పోలీసుల గుర్తించారు. రాత్రి కావడంతో రెస్క్యూ టీమ్‌కు ఇబ్బంది కలిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కొన్ని రోజుల కిందట హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు పిల్లలతో సహా ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం(Family Suicide Attempt) సంచలనమైంది. బిల్లుల విషయంలో ఓ కాంట్రాక్టర్ మోసం చేయడంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో బాధితులు పేర్కొన్నారు. ఈ ఘటనపై బంధువుల ద్వారా సమచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి సరైన సమయంలో చేరుకోవడంతో ఆ కుటుంబానికి ప్రాణాపాయం తప్పింది. సరూర్ నగర్ కుటుంబ ఆత్మహత్యయత్నం బాధితులు శశికుమార్, అతని భార్య శ్వేతా తమ ఆవేదనను అధికారులకు తెలిపారు. దినేష్ రెడ్డి అనే వ్యక్తి డబ్బులు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని వాపోయారు. వేధింపులు తట్టుకోలేక పిల్లలతో సహా చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
దినేష్ రెడ్డి వద్ద ఎలక్ట్రికల్ సబ్ కాంట్రాక్టర్ గా శశికుమార్ పనిచేస్తున్నాడని అతడి భార్య శ్వేత తెలిపారు. 2019 ఫిబ్రవరి నెల నుంచి దినేష్ రెడ్డి డబ్బులు ఇవ్వడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. సుమారు రూ.2 కోట్ల వరకు చెల్లించాలన్నారు. డబ్బులు ఇవ్వమని అడిగితే వేధింపులకు గురి చేస్తున్నాడని వాపోయారు. చనిపోయే ముందు కూడా డబ్బులు ఇవ్వమని కోరినా చస్తే చావండని అన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు పిల్లలతో సహా నిద్ర మాత్రలు వేసుకున్నామన్నారు. దినేష్ రెడ్డి నుంచి తమకు న్యాయంగా రావాల్సిన నగదు ఇప్పించాలని ఆమె వేడుకున్నారు.