ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని ఎల్లారెడ్డిపేటకి చెందిన ఇద్దరు కాంట్రాక్టర్ల మధ్య వివాదం పరస్పర దాడులకు దారితీసింది. ప్రభుత్వం బిల్లుల చెల్లింపు విషయంలో ఆలస్యం అవుతుండటంతో అప్పటివరకు కలిసిమెలిసి తిరుగుతూ.. రోజంతా పలు ఆఫీసుల్లో అధికారులను కలుస్తూ వచ్చిన ఆ ఇద్దరు కాంట్రాక్టర్లు ఇలా మద్యం పుచ్చుకున్నారో లేదో అలా ఒకరిపై ఒకరు తీవ్రమైన దాడులకు తెగబడ్డారు. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలై ఆసుపత్రి పాలయ్యారు.
ఇక వివరాల్లోకి వెళితే.. సిరిసిల్లలో ఎల్లారెడ్డి పేటకు చెందిన జవ్వాజి లింగం, కూర నారాయణ రెడ్డి అనే ఇద్దరు కలిసి మెలిసి కాంట్రాక్టు పనులు చేసేవారు. ఎవరికి కాంట్రాక్టు వచ్చినా మరొకరు ఆర్థికంగానో లేక ఇతరత్రా సహాయం చేస్తూనో దానికి తగిన ప్రతిఫలం పొందేవారు. ఎల్లారెడ్డి పేట మండల కేంద్రానికి చెందిన జవాజి లింగం కాంట్రాక్టర్ గా ఇప్పటికే అనుమతి పొంది అనేక ప్రభుత్వ పనులను చేస్తున్నారు. అయితే లింగం టెండర్లలో తనకు దక్కిన ఈ పనులను సబ్ కాంట్రాక్టు కింద బండలింగంపల్లి కి చెందిన కూర నారాయణ రెడ్డికి కొంత శాతం కమిషన్ ఇస్తూ వాటిని పూర్తి చేస్తూ ఇద్దరూ ప్రభుత్వ బిల్లులను కమిషన్ ప్రకారం పంచుకుంటున్నారు.
కోరుట్ల పేటలోని డబల్ బెడ్ రూమ్ నిర్మాణానికి సంబంధించి సీసీ రోడ్ల కాంట్రాక్టులు లింగం పొందాడు. దీన్ని నారాయణ రెడ్డికి సబ్ కాంట్రాక్టు కింద ఇచ్చాడు. ఇప్పటి వరకూ పూర్తి అయిన పనులకు సంబంధించిన డబ్బులు అడగడం ప్రారంభించాడు. ప్రతి రోజూ తనకు రావాల్సిన రూ.42 లక్షలు త్వరగా వచ్చేలా చేయాలంటూ నారాయణరెడ్డి లింగంను అడుగుతున్నాడు. దీని బిల్లులకు సంబంధించి సోమవారం రోజున సిరిసిల్లలోని ప్రభుత్వ కార్యాలయాలకు వారిద్దరూ కలిసి అధికారులకు విన్నవించుకున్నారు. తమ పనులు పూర్తయ్యాక అక్కడికి వైన్ షాప్ లో లిక్కర్ కొనుగోలు చేసి ఇద్దరు కలిసి బైపాస్ రోడ్డు సమీపంలో కలిసే తాగారు.
డబ్బు చెల్లింపుల విషయంలో ఒక్కసారిగా వివాదం ముదిరింది. దీంతో పరస్పరం కత్తులు బీర్ సీసాలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో నారాయణ చేతులకు గాయాలై తీవ్ర రక్తస్రావం కాగా లింగం నాలుక తెగిపోయి బట్టలు మొత్తం రక్తంతో తడిసిపోయాయి. బహిరంగంగా ఒకరిపై దాడులు చేసుకున్న వీరిని చూసిన అక్కడి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసుల సహాయంతో వెంటనే ఇద్దరినీ సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్ తెలిపారు.