కాలుష్యం పేరుతో శనివారం ఆర్ ఎఫ్ సీ ఎల్ (RFCL) లో ఎరువుల ఉత్పత్తి నిలిపివేయాలంటూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ ఆదేశాల మేరకు ఉత్పత్తిని నిలిపివేశారు. అయితే, అత్యవసర పరిస్థితిల్లో సోమవారం నుంచి తిరిగి ఉత్పత్తిని ప్రారంభించారు. ఆర్ ఎఫ్ సీ ఎల్ యజమాన్యం అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం.. ప్రస్తుతం దేశంలో ఎరువుల వాడకం పెరగడంతో పాటు యూరియా డిమాండ్ కూడా చాలా పెరిగింది కాబట్టి కర్మాగారంలో ఉత్పత్తి ఆపివేయడం వల్ల రైతులకు సకాలంలో ఎరువులు అందించకపోయే అవకాశం ఉంది. ఆ ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు తక్షణమే ఈ నిర్ణయాలు తీసుకున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులకు ఆర్ ఎఫ్ సీ ఎల్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి సమయం కోరడంతో అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. దీంతో ఎరువుల ఉత్పత్తి తిరిగి జరుగుతుందని ఆర్ ఎఫ్ సీ ఎల్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఫ్యాక్టరీ గురించి మార్చి 22న స్థానిక ఎమ్మెల్యే పీసీబీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే కాలుష్య నియంత్రణ బోర్డు టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించి ఫ్యాక్టరీలో విచారణ చేపట్టింది. అందులో మొత్తం 12 చోట్ల వ్యవస్థాపరమైన లోపాలు ఉన్నాయని, కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రత్యేకమైన యంత్రాలు లేవని తేల్చారు. అమ్మోనియా నిల్వ ట్యాంకు, ఉత్పత్తి ప్లాంటు, యూరియా తయారీ టవర్ నుంచి అమ్మోనియా గ్యాస్ లీకవుతున్నట్లుగా గుర్తించారు. అయితే, అమ్మోనియా వాయువు లీకేజీని కనిపెట్టేందుకు 51 చోట్ల సెన్సార్లు అమర్చామని యాజమాన్యం చెప్పగా, అవి సరిగ్గా పని చేయడం లేదని కమిటీ ధ్రువీకరించింది. దీంతో తాజాగా ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
పరిశ్రమ నుంచి విడుదలవుతున్న కాలుష్యానికి సంబంధించి గతం నుంచే ఇక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. వాయు, శబ్ద కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నామని లక్ష్మీపురం, వీర్లపల్లి తదితర ప్రాంతవాసులు కర్మాగారం ముందు గతంలో ఆందోళనకు దిగారు. అయినా ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యం ఏ చర్యలు తీసుకోకపోగా నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నారంటూ 28 మందిపై కేసులు పెట్టింది. అమ్మోనియా లీకేజీ కారణంగా గోదావరిఖనితో పాటు వీర్లపల్లి, లక్ష్మీపురం తదితర గ్రామాల వారు ఆందోళన చెందుతున్నారు. ఇటు ఎరువుల తయారీ తర్వాత వాషింగ్, కూలింగ్, ఇతర పరిశ్రమ అవసరాలకు వినియోగించే వ్యర్థాలతో కూడిన 6,240 కిలోలీటర్ల నీరు బయటకు వస్తోంది. అమ్మోనియా, యూరియా ప్లాంట్ల నుంచి మరో 840 కిలోలీటర్ల నీటి వ్యర్థాలు వెలువడుతుంటాయి.
ఇక తెలంగాణ, ఏపీ సహా పక్కనున్న రాష్ట్రాలకు ఇదే ఫ్యాక్టరీ నుంచి యూరియా సరఫరా అవుతోంది. ఉత్పత్తి ఆగితే ఈ రాష్ట్రాల వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడే సూచనలున్నాయని వ్యవసాయాధికారులు తెలిపారు. ఈ కర్మాగారం నుంచి రోజూ సిద్ధమయ్యే 4,235 టన్నుల యూరియాలో సగం వరకూ తెలుగు రాష్ట్రాలకే కేటాయిస్తున్నారు. గత రెండు నెలల్లో 60 వేల టన్నులకు పైగా యూరియా తెలంగాణకు సప్లై కాగా మరో 10 రోజుల్లో తొలకరి వర్షాలు ప్రారంభం కానున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది.