Guntur News : గుంటూరు జిల్లాలో కృష్ణానదిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. విజయవాడ నిడమానూరుకు చెందిన కొప్పుల మురళి అలియాస్ నాని (19), బొడ్డుల నాగేంద్రబాబు (21) నదిలో ఈతకు వెళ్లి మునిగిపోయారు. కొప్పుల మురళిని స్థానిక మత్స్యకారులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మురళి మృతి చెందాడు. నాగేంద్రబాబు ఆచూకీ కోసం APSDRF, పోలీసులు, మత్స్యకారులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 


కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 


కరీంనగర్ జిల్లా చింతకుంట లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోలెరో వ్యాన్ బైక్ ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతదేహాలను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారు చందు, మహేష్ బాబుగా పోలీసులు గుర్తించారు. హర్ష అనే యువకుడు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో హర్ష చికిత్స పొందుతున్నారు. ప్రమాదం విషయం తెలిసిన బాధితుల కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. 



పెళ్లి రోజునే ప్రమాదం 


ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం మాండగడలో విషాదం చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన ఉమేశ్‌ అనే వ్యక్తి తన పెళ్లి రోజు కావడంతో భార్యతో గుడికి వెళ్లాడు. ఆ తర్వాత ఆమెను ఇంటి వద్ద దింపి పనినిమిత్తం మహారాష్ట్రకు బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామ సమీపంలోని రహదారిపై వెనక నుంచి వాహనం ఢీకొట్టడంతో ఉమేశ్ అక్కడిక్కడే చనిపోయాడు. ఏడాది పూర్తయిన సందర్భంగా పెళ్లి వేడుకలు జరుపుకున్న కొద్దిసేపటికే ఇలా జరగడంతో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. భార్యను గుడికి తీసుకెళ్లేటపుడు హెల్మెట్‌ ధరించిన ఉమేశ్ ఊరు వెళ్లేటప్పుడు హెల్మెట్‌ మరిచిపోవడంతో తలకు గాయాలై చనిపోయాడు. హెల్మెట్‌ ఉంటే ప్రాణాలు నిలిచేదని స్థానికులు అంటున్నారు. పెళ్లి వేడుకలు జరుపుకున్న కొద్దిసేపటికే ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. 


పల్నాడులో ఘోర ప్రమాదం


పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం, ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో మొదట ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. ఆపై ఆసుపత్రికి తరలించగా మరో వ్యక్తి చనిపోయినట్లు సమాచారం. శ్రీశైలం వెళ్లి శివయ్య దర్శనం చేసుకుని వస్తున్న కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురై ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.