Encounter in J&K: జమ్ముకశ్మీర్ పుల్వామాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతి చెందిన ఉగ్రవాదులు జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందినవారిగా కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.






ఇదీ జరిగింది?


ఉగ్రవాదులకు సంబంధించి సమాచారం అందడంతో ఆదివారం రాత్రి భద్రతా బలగాలు, స్థానిక పోలీసుల సంయుక్త బృందం కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి.


ఆదివారం రాత్రి ఓ ఉగ్రవాది హతమయ్యాడు. సోమవారం ఉదయం మరో ఉగ్రవాదిని మట్టుబెట్టినట్లు ఐజీపీ పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రెండు ఏకే రైఫిల్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.


గండిపొరా ప్రాంతంలో ఆదివారం రాత్రి ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని పేర్కొన్నారు. రియాజ్‌ అనే పోలీస్‌ను కాల్చి చంపిన ఘటనలో ఈ ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొన్నట్లుగా తెలిపారు.


ఇటీవల


ఇటీవల జమ్ముకశ్మీర్​లో జరిగిన వరుస ఉగ్రవాద దాడుల్లో ఓ కానిస్టేబుల్​, టీవీ నటి బలయ్యారు. దీంతో ఉగ్రమూకలను కట్టడి చేసే చర్యలను ముమ్మరం చేసిన భద్రతా సిబ్బంది.. ఇటీవల జరిపిన రెండు వేర్వేరు ఎన్​కౌంటర్లలో నలుగురు తీవ్రవాదలను మట్టుబెట్టారు. వీరిలో టీవీ నటి హత్యకు కారణమైన ఇద్దరు ముష్కరులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారని గుర్తించారు.


శ్రీనగర్​లోని సౌరా ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో మరో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇప్పటివరకు ఉగ్రవాద కట్టడి చర్యల్లో భాగంగా మూడు రోజుల వ్యవధిలో 10 మంది ముష్కరులను మట్టుబెట్టారు పోలీసులు. వీరిలో ఏడుగురు లష్కరే తోయిబాకు చెందినవారు కాగా ముగ్గురు జైషే మహమ్మద్​ సంస్థకు చెందిన వారు.


Also Read: Sidhu Moose Wala Murder Case: సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఆరుగురు అరెస్ట్



Also Read: Brazil Rains: బ్రెజిల్‌లో భారీ వర్షాలు, వరదలు ధాటికి 44 మంది మృతి