Sidhu Moose Wala Murder Case: పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక అప్‌డేట్ వచ్చింది. హత్యతో ప్రమేయం ఉన్నట్టుగా అనుమానిస్తున్న ఆరుగురిని ఉత్తరాఖండ్, పంజాబ్ సంయుక్త పోలీసు బృందం అరెస్టు చేసింది. దెహ్రాదూన్‌లో వీరిని అదుపులోకి తీసున్నారు.
ఉత్తరాఖండ్ ఎస్‌టీఎఫ్, పంజాబ్ పోలీసులు ఆకస్మిక దాడులు జరిపి నిందితులను అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. ఇంటరాగేషన్ కోసం వీరిని పంజాబ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.
24 గంటల్లోపే
పంజాబ్ ప్రభుత్వం మూసేవాలాకు భద్రతను తగ్గించిన 24 గంటల్లోపే ఆయనను గ్యాంగ్‌స్టర్లు కాల్చిచంపారు. తమ పూర్వీకుల స్వగ్రామమైన మాన్సాకు ఎస్‌యూవీలో మూసేవాలా వెళ్తుండగా సుమారు 10 నుంచి 12 మంది వ్యక్తులు అతడ్ని అడ్డుకుని అతి సమీపం నుంచి ఆయనపై 20 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మూసేవాలా అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన మిత్రులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసుపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసుపై పంజాబ్-హరియాణా హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక బృందం దర్యాప్తు చేయనున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం ప్రకటించారు.
సిద్ధూ హత్యను సీఎం భగవంత్ మాన్ ఖండించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కటకటాలకు నెట్టే వరకు ప్రభుత్వం అవిశ్రాంతంగా శ్రమిస్తుందని మాన్ అన్నారు.
సిద్ధూ తండ్రి బాల్కర్ సింగ్ సిద్ధూ అభ్యర్థన మేరకు ఈ కేసును సిట్టింగ్ జడ్జి చేత దర్యాప్తు చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును అభ్యర్థిస్తుందని భగవంత్ మాన్ తెలిపారు. ఎన్‌ఐఏ వంటి జాతీయ దర్యాప్తు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.
Also Read: Sidhu Moose Wala Death: సింగర్ సిద్ధూ హత్య కేసుపై సీఎం మాన్ కీలక ప్రకటన
Also Read: Brazil Rains: బ్రెజిల్‌లో భారీ వర్షాలు, వరదలు ధాటికి 44 మంది మృతి